ఐరాస సదస్సుకు ఏపీ విద్యార్థులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 10 మంది విద్యార్థులు ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఈ నెల 16 నుంచి నిర్వహించే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీ) సదస్సుకు ఎంపికయ్యారు. 8 మంది బాలికలు, ఇద్దరు బాలురతో కూడిన ఈ బృందం గురువారం హైదరాబాద్ నుంచి విమానం ద్వారా అమెరికాలోని న్యూయార్క్ నగరానికి బయలుదేరనుంది. ఇందుకోసం బుధవారం రాత్రి విజయవాడ నుంచి ఈ బృందం రోడ్డు మార్గంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లింది. అంతకు ముందు విద్యార్థుల బృందంతో విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఐక్యరాజ్య సమితిలో అడుగుపెట్టడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం కావడం గర్వకారణమన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేద, బలహీన వర్గాల పిల్లల అభ్యున్నతికి చేస్తున్న కృషికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఉత్తర అమెరికాలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ పర్యటనను విజయవంతం చేసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యార్థి ప్రతినిధుల బృందాన్ని పూర్తి ప్రభుత్వ వ్యయంతోనే అమెరికాకు తీసుకెళ్తున్నట్టు అధికారులు మంత్రికి వివరించారు. వారం రోజుల పర్యటనలో విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పించామన్నారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్కుమార్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.













