వ్యాక్సినేషన్ కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించిన ఏపీ సర్కార్

వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం ఏపీ ప్రభుత్వం గ్లోబల్ టెండర్లకు ఆహ్వానం పలికింది. కోటి మందికి వ్యాక్సినేషన్ చేయాల్సి ఉంటుందని తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. మే 13న సాయంత్రం 4 గంటల నుంచి టెండర్ల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పిస్తున్నామని పేర్కొంది. జూన్ 3 వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు టెండర్ల డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలని నిబంధన విధించింది. మరోవైపు టెండర్ల టెక్నికల్ బిడ్లను కూడా అదే రోజు సాయంత్రం 5 గంటలకు తెరవాలని నిర్ణయించింది. ఈ నెల 20,22 తేదీల్లో ప్రీ బిడ్ సమావేశం ఉండే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. ఈ టెండర్లలో పాల్గొనే వారు ఏపీ మెడికల్ సర్వీసెస్ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ పేరిట డీడీ తీయాలని ప్రభుత్వం సూచించింది. అంతేకాకుండా ప్రతి నెలా 25 లక్షల మందికి వ్యాక్సిన్ వేసేలా సరఫరా చేయాలని నిబంధన విధించారు.
ఏపీ నిర్ణయాలను ఇతర రాష్ట్రాలు అవలంబిస్తున్నాయి..
కరోనా నివారణలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఇతర రాష్ట్రాలు అవలంబిస్తున్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. గడచిన 24 గంటల్లో 94,446 టెస్టులు చేశామని, 22,399 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. కరోనా కారణంగా 89 మంది మృతి చెందారని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు పొంది, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితులందరికీ ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేసేలా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మిగిలిన రాష్ట్రాల కంటే ముందుగా ఏపీ ప్రభుత్వం గ్లోబల్ టెండర్లకు వెళ్లడం వల్ల మంచి స్పందన రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.