ఘోర ప్రమాదం.. ఏపీకి చెందిన ఎన్నారై కుటుంబం మృతి
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎన్నారై కుటుంబం మృత్యువాత పడింది. అన్నమయ్య మదనపల్లికి చెందిన దండు గౌస్ బాషా కువైట్‌లోని అమెరికన్ యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తున్నాడు. తన భార్య తబారక్ సర్వర్, ఇద్దరు కుమారులు ఏహాన్(02), దామీల్ (ఎనిమిది మాసాలు) తో కలిసి కువైట్ నుంచి పది రోజుల క్రితం సౌదీ అరేబియా పర్యటనకు (ఉమ్రా) వచ్చారు. సౌదీలోని మక్కా, మదీన పుణ్యక్షేత్రాలను సందర్శించుకున్నారు. మదీనాలోని ప్రవక్త మసీదులో ఉమ్రా నిర్వహించి, ప్రార్థనలు చేశారు. తిరిగి కారులో కువైట్‌కు వెళ్తుండగా శుక్రవారం తెల్లవారు జామున ప్రమాదం చోటు చేసుకుంది.
రియాధ్ నగరం నుంచి 120 కిలో మీటర్ల దూరంలో హఫ్నా రోడ్డుపై డివైడ్‌ను వారు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. దాంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి అగ్నికి అహుతి అయింది. కారులో ప్రయాణిస్తున్న ఈ నలుగురు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను రియాధ్ సమీపంలోని రూమా ఆసుపత్రికి తరలించారు. నలుగురు మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. కారులోని పాస్ పోర్టులు, ఇతరత్రా సామాన్లు పూర్తిగా కాలిపోయాయి. చనిపోయిన వారిని గుర్తించడం అక్కడి పోలీసులకు కష్టంగా మారింది. ప్రముఖ సామాజిక కార్యకర్త సిద్ధిఖ్ తువ్వూర్ మలయాళీ సంఘం కార్యకర్తల సహాయంతో బాధితులను గుర్తించి, వారి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని చేరవేశారు. రోడ్డు ప్రమాదం గురించి తెలిసిన గౌస్ బాషా తల్లిదండ్రులు తీవ్ర దుఖంలో మునిగిపోయారు.













