ఎపి శాసనసభ సమావేశాలకు సర్వం సిద్ధం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. ఓ వైపు కరోనా కల్లోలం మరోవైపు కత్తులు దూస్తున్న అధికార ప్రతిపక్ష పార్టీలు …ఇదివరకు ఎన్నడూ చూడని విచిత్రమైన పరిస్థితుల మధ్య తొలి అసెంబ్లీ సమావేశాలు జరుగనుండడం అందరిలో ఉత్సుకత రేపుతోంది. అధికార పార్టీ వైసీపీ…తన హామీల అమలుతో పాటు ప్రతిపక్ష పార్టీ నేతల అరెస్టులతో తన పంధా ఏమిటో చెప్పకనే చెబుతున్న నేపధ్యంలో పార్టీ నేతల్లో సన్నగిల్లుతున్న విశ్వాసాన్ని తిరిగి తేవడం, వారికి తాము అండగా ఉన్నామన్న భరోసా ఇవ్వడం అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపడమే లక్ష్యంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోంది.
రాజకీయం వద్దు: శ్రీకాంత్‌రెడ్డి
ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కోసం చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని అధికార పార్టీ అంటోంది. సభ్యులకు కరోనా పరీక్షలు చేయడం దగ్గర్నుంచి అత్యవసర సేవల కోసం అంబులెన్స్‌ల ఏర్పాటు దాకా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని ఆ పార్టీ నేత శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. సభ్యులతో వచ్చే వ్యక్తిగత సహాయ సిబ్బంది, భధ్రతా సిబ్బందిపై పూర్తి నియంత్రం ఉంటుందని స్పష్టం చేశారు. సభ ఎన్ని రోజులు నడపాలన్నది ప్రారంభ రోజు నిర్వహించే బిబిసి సమావేశంలో నిర్ణయిస్తామన్నారు. విపత్కర పరిస్థితుల్లో నిర్వహిస్తున్న ఈ సమావేశాలలో రాజకీయ పరమైన చర్చలకు తావివ్వకపోతే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై ప్రతిపక్ష పార్టీ ఆలోచించాలన్నారు. ఈ సమావేశాలను గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ఆమోదం వరకూ మాత్రమే పరిమితం చేయాలనేది ప్రభుత్వ ఉధ్దేశ్యంగా ఆయన వెల్లడించారు.
నల్లచొక్కాలే ముద్దు: తేదేపా
మరోవైపు తమ నేతల వరుస అరెస్టులతో కాకమీదున్న తెలుగుదేశం పార్టీ దీనిపై శాసనసభలో తమ నిరసన తెలియజేయాలని నిర్ణయించుకుంది. ఇది అధికార దర్పంతో చేస్తున్న అరాచకమేనంటున్న ఆ పార్టీ తమ నిరసన తెలియజేయడానికి తొలుత అసెంబ్లీని బాయ్‌కాట్ చేయాలని ఆలోచించినప్పటికీ… తర్జన భర్జనల తర్వాత ప్రభుత్వ దమననీతి, తమ నిరసన ప్రజలకు తెలియాలంటే అసెంబ్లీకి హాజరుకావడమే సరైందని నిర్ణయించుకుంది. శాసనసభ సమావేశాలకు నల్లచొక్కాలతో హాజరుకావాలని తమ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చింది. మరోవైపు ఎన్నడూ లేని విధంగా గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు













