రాష్ట్ర భవిష్యత్తు కోసం జరిగే సభ …యువగళం
యువగళం విజయోత్సవ జైత్రయాత్ర సభ రాష్ట్ర భవిష్యత్తు కోసం జరిగే సభ అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలేపల్లిలో భారీ సభ ఏర్పాటు చేసేందుకు టీడీపీ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. సభకు సంబంధించి ఏర్పాట్లపై అచ్చెన్నాయుడు సమీక్షించారు. ఎన్నికల శంఖారావం పూరించే సభగా విజయోత్సవ సభను అభివర్ణించారు. ఈ సందర్భగా అచ్చెన్న మాట్లాడుతూ సభకు 6 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. విజయోత్సవ సభలోనే ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేద్దామనుకున్నామని, అయితే ఇది యువగళం సభ అయినందున ప్రకటించడం లేదని చెప్పారు. త్వరలోనే టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల కలయికతో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
యువగళం విజయోత్సవ జైత్రయాత్ర సభకు టీడీపీ ప్రత్యేక రైళ్లను సైతం ఏర్పాటు చేసింది. రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి 7 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడిరచింది. ప్రత్యేక రైళ్లు ఈ నెల 19న చిత్తూరు, తిరుపతి, రైల్వే కోడూరు, అనంతపురం, ఆదోని, నెల్లూరు, మాచర్ల నుంచి ప్రారంభమైన తర్వాతి రోజు విజయనగరం చేరుకోనున్నాయి. ఒక్కో రైలులో 1300 మంది ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు అద్దెకు బస్సులను సమకూర్చాల్సిందిగా ఆర్టీసీ అధికారులకు లేఖ రాసినట్లు వెల్లడించారు.













