జగన్ కి రాష్ట్ర ప్రజలకు మధ్య యుద్ధం : అచ్చెన్న
పేదలను విస్మరించిన జగన్‌కి రాష్ట్ర ప్రజల మధ్య యుద్ధం జరుగుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అబద్దాలు ఆడటం సీఎం జగన్‌కు బాగా అలవాటు అయిందన్నారు. రాష్ట్రంలోని పేదల పట్ల సీఎం జగన్ కపట ప్రేమ చూపిస్తున్నారన్నారు. జగన్‌కు పేదలపై ఉన్న ప్రేమ నిజమైతే వారి కోసం టీడీపీ తీసుకొచ్చిన 120 పథకాలను ఎందుకు రద్దు చేశారని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సబ్ ప్లాన్ నిధులు రూ.1.14 లక్షల కోట్లను ఎందుకు మళ్లించారంటూ ప్రశ్నించారు. నాసికరమైన మద్యంతో 20 వేల మంది పేదల ప్రాణాలు తీశారు. అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదల పొట్టకొట్టారు.పెళ్లి కానుకలు, సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ కానుకలు రద్దు చేశారు. 2018-19లో సంక్షేమానికి టీడీపీ 18.21 శాతం ఖర్చు చేస్తే, 2022-23లో జగన్ ప్రభుత్వం 16.20 శాతం మాత్రమే ఖర్చు చేశారు. టీడీపీ సంక్షేమం పేదలను సొంత కాళ్లపై నిలబడితే, జగన్ రెడ్డి పేదలను బిచ్చగాళ్లని చేశారు. ఇకపై జగన్ రెడ్డిని భరించలేమని రాష్ట్ర ప్రజలు అంటున్నారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్, మాఫియాలకే జగన్ రెడ్డి కావాలి. పేదలకు కాదు జగన్ రెడ్డిని మించిన పెత్తందారు మరొకరు లేరు అని విమర్శించారు.













