Chandrababu: చంద్రబాబు రాయచోటి సభలో పథకాలపై ప్రశ్నించిన యువకుడు..
ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తాజాగా అనూహ్యమైన పరిణామాన్ని ఎదుర్కొన్నారు. శనివారం పింఛన్ల పంపిణీ కోసం అన్నమయ్య జిల్లా రాయచోటికి (Rayachoti) వెళ్లిన ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా, ఓ యువకుడు సూపర్ సిక్స్ (Super Six) పథకాల గురించి సూటిగా ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. చంద్రబాబు తన ప్రభుత్వం గడిచిన 8 నెలల్లో చేసిన పనుల గురించి మాట్లాడుతుండగా, వేదికకు సమీపంలో కూర్చున్న యువకుడు “సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడే వస్తాయి?” అని ప్రశ్నించాడు. ఇది అక్కడికి వచ్చిన వారందరికీ ఆశ్చర్యం కలిగించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ యువకుడిని అక్కడి నుంచి తీసుకువెళ్లారు.
ఈ ఘటనపై ప్రతిపక్ష వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీలు అమలు కాకుండా ఉన్నాయని, 8 నెలల పాలనలో ప్రజలు విసిగిపోయారని వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు ఇప్పటివరకు అమలుకు రాకపోవడంపై నిరసనలు పెరుగుతున్నాయని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ యువకుడు ముఖ్యమంత్రి సభలోనే ప్రశ్నించడం పెద్ద చర్చకు దారితీసింది.
ప్రస్తుతం ప్రభుత్వం సామాజిక పింఛన్ల పెంపు, మహిళలకు ఆర్థిక సహాయం వంటి అంశాలను గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ, హామీల అమలులో జాప్యం ఉందని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా మహిళలకు నెలకు ₹1500 అందించాలన్న మాట ఇంకా నెరవేరకపోవడంతో, దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అదే విధంగా “తల్లికి వందనం,” “అన్నదాతా సుఖీభవ,” “ఉచిత బస్సు ప్రయాణం” వంటి పథకాలు కూడా ఏమయ్యాయనే ప్రశ్నలు ప్రతిపక్షం నుంచి వస్తూనే ఉన్నాయి. మరోవైపు రైతుల సమస్యలు, విద్యార్థుల ఫీజు బకాయిలపై కూడా ఆందోళనలు పెరుగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతుందనే వాదనకి మద్దతుగా రాయచోటి ఘటన మారిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రత్యక్షంగా ప్రశ్నించిన యువకుడిపై ప్రభుత్వం కఠినంగా స్పందించడంపై విమర్శలు ఎక్కువయ్యాయి. చంద్రబాబు కూడా ఆ యువకుడిపై అసహనం వ్యక్తం చేస్తూ, “ఇలాంటి అవుట్‌డేటెడ్ థింకింగ్ ఉన్న యువకులు కొందరు ఉంటారు, వాళ్ల విధానం అలా ఉంటుంది, మనం ఏం చేయలేం” అంటూ వ్యాఖ్యానించారు.
దీంతో, ప్రభుత్వ తీరుపై ఆ యువకుడు కూడా ఘాటుగా స్పందించాడు. “ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తే తప్పా? నేనేమైనా క్రిమినల్ నా?” అంటూ నిలదీయడంతో, పోలీసులు అతడిని వ్యాన్‌లోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, ప్రతిపక్షం దీనిని మరింతగా ప్రయోజనంగా మలుచుకుంటూ, “ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది” అంటూ ప్రచారం మొదలు పెట్టింది. సామాన్య ప్రజలకు సంబంధించిన హామీలు ఇంకా నెరవేరకపోవడంతో, రానున్న రోజుల్లో ఇలాంటి ప్రశ్నలు మరింత పెరిగే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.













