ప్రధాని మోదీ అమెరికా పర్యటన
ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా మోదీ ఈ నెల 25, 26 తేదీల్లో అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. 26న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో తొలిసారి భేటీ కానున్నారు. వారి భేటీ ముఖ్య ఉద్దేశమేమిటని ప్రశ్నించగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే స్పందిస్తూ పరస్పర లబ్ధి కోసం రెండు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడం ఎలా అన్నది ఈ పర్యటన అజెండాల్లో ఒకటి అని తెలిపారు. అమెరికా జాతి విద్వేష దాడుల గురించి మోదీ ప్రస్తావిస్తారా అని అడగ్గా అన్ని దాడులూ జాతి విద్వేష దాడులు కావన్నారు. 25న అమెరికా అగ్ర సంస్థల సీఈవోలతో మోదీ భేటీ అవుతారని తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం భారత సమాజంతో నిర్వహించే కార్యక్రమం ఉంటుందని చెప్పారు.













