లాక్డౌన్ను ఎత్తివేయడం సాధ్యం కాదు : మోదీ
దేశంలో వేగంగా వ్యాపిస్తున్న కొవిడ్ -19 వైరస్ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను అఖిలపక్షానికి ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. పార్లమెంటులో ప్రతిపక్షాలు, ఇతర పార్టీల ముఖ్య నేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న 21 రోజుల లాక్డౌన్ను మరికొన్ని రోజులు పొడగించాలని ఆయా రాష్ట్రాలు కోరుతున్న తరుణంలో ఈ సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏప్రిల్ 14 తర్వాత లాక్డౌన్ ఎత్తేసే అవకాశాలు కనిపించడం లేదని మోదీ అన్నారని తెలిసింది. కొవిడ్-19 తర్వాత జీవితం అంతకుముందులా ఉండకపోవచ్చని ఆయన తెలిపారు. పరిస్థితి కరోనా ముందు, కరోనాకు తర్వాత అన్నట్టుగా మారుతుందని వెల్లడించారు. వ్యక్తిగత, ప్రవర్తన, సామాజిక మార్పులు ఎన్నో జరగాల్సి ఉంది అని నేతలతో మోదీ పేర్కొన్నారని సమాచారం.













