పార్లమెంటు చరిత్రలో మరో సంచలనం
పార్లమెంట్ సమావేశాల చరిత్రలో మరో సంచలనం. ఏపీ విభజన సమయంలో పార్లమెంట్ తలుపులు మూసి, ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి, లోక్సభ కార్యక్రమాలు కొనసాగించినట్లుగానే నేడు రాజ్యసభలోనూ ప్రత్యక ప్రసారాలు నిలిపివేయించి సభా కార్యక్రమాలను కొనసాగించారు. టీడీపీ, వైసీపీ సభ్యులు సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన చైర్మన్ వెంకయ్యనాయుడు సుమారు 30 నిముషములపాటు ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలపై స్వల్పకాలిక చర్చకు టీడీపీ, వైసీపీ సభ్యులు పదే పదే పట్టుపట్టారు. చర్చ రేపు (ఈ నెల 24న) చేపడతామని వెంకయ్య సృష్టం చేసినా ఎంపీలు అందోళనకు దిగారు. మీ గోల ఎవరూ వినడం లేదు. చూడడం లేదు. ఇంకా ఎందుకు అరుస్తారంటూ టీడీపీ, వైసీపీ ఎంపీలపై వెంకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా వెంటనే టీవీ ప్రసారాలు నిలిపివేయాలని ఆయన ఆదేశించారు. చైర్మన్ ఆదేశాలతో రాజ్యసభ ప్రత్యక్ష ప్రసారాలు కొద్దిసేపు ఆపారు.













