తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా శివరాత్రి వేడుకలు
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారంనాడు తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో కిక్కిరిశాయి. శివ నామస్మరణలతో శైవక్షేత్రాలు మార్మోగాయి. వేకువజాము నుంచే భక్తులు దేవాయాలకు పోటెత్తారు. వరుసగా రెండు రోజులు ఆదివారం, సోమవారం కూడా సెలవు కలిసి రావడంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం, తెలంగాణలోని వేములవాడ ఆలయాలకు భక్తులు పొటెత్తారు. మహా శివరాత్రిని పురస్కరించుకుని గవర్నర్ నరసింహన్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఛేనెంబర్లో బ్రహ్మకుమారి ఈశ్వరీ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన భారీ శివలింగాన్ని తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మూెత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగలోని శ్రీములింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భీమవరంలోని పంచారామక్షేత్రమైన సోమరామానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం అర్థరాత్రి 12:30 నిమిషాలకే ఆలయ తలుపులు తెరిచారు. పంచారామ క్షేత్రం పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు.













