ఉభయ సభలు రేపటికి వాయిదా
పార్లమెంట్లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. బుధవారం ఉదయం లోక్సభ ప్రారంభమైన వెంటనే అన్నాడీఎంకే, టీఆర్ఎస్ సభ్యులు తమ సమస్యలపై నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ మహాజన్ సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా అదే పరిస్థితి నెలకొనడంతో స్పీకర్ సభను గురువారం నాటికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలో ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో చైర్మన్ సభను రేపటికి వాయిదా వేశారు. కావేరీ అంశంపై అన్నాడీఎంకే, రిజర్వేషన్లపై టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు సిద్ధంగా ఉన్నామని అనంతకుమార్ ప్రకటించారు. సభ్యులు ఆందోళన విరమించి చర్చకు సహకరించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ కోరారు. అయినా అన్నాడీఎంకే, టీఆర్ఎస్ సభ్యులు వెనక్కి తగ్గలేదు. దీంతో నిరసనల మధ్య చర్చ కొనసాగించలేమని సభాపతి పేర్కొంటూ సభను రేపటికి వాయిదా వేశారు.













