ఉభయ సభలూ రేపటికి వాయిదా
ప్రతిపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంట్ ఉభయ సభలూ రేపటికి వాయిదా పడ్డాయి. కేంద్రంపై తెలుగుదేశం, వైకాపా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలపై దేశవ్యాప్తగా ఆసక్తి నెలకొనడంతో దీనిపై లోక్సభలో చర్చ జరుగుతుందని అనుకున్నారు. కానీ ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే టీఆర్ఎస్, అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేయడంతో సభ 12 గంటలకు వాయిదా పడింది. గంట తర్వాత ప్రారంభమయ్యాకా అదే పరిస్థితి నెలకొంది. కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే, రిజర్వేషన్ల పెంపు అంశంపై టీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ వెల్లోకి ప్రవేశించి నినాదాలు చేశారు. వారి ఆందోళన మధ్యే స్పీకర్ కాసేపు ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. అయినా వారు బిగ్గరగా నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. సభ సజావుగా సాగేందుకు సభ్యులు సహకరించాలని, అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించేందుకు వీలు కల్పించాలని స్పీకర్ కోరినా వారు వినిపించుకోలేదు. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. అటు రాజ్యసభలోనూ ఆందోళనలు కొనసాగాయి. వివిధ అంశాలపై విపక్ష పార్టీలు ఆందోళన చేయడంతో సభ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు.













