ఏడాదిపాటు సంబురాలు రద్దు!
జల విలయంలో చిక్కుకొని విలవిల్లాడిన కేరళలో ఏడాది పాటు అన్ని అధికారిక సంబురాలను రద్దు చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భారీ వర్షాలు, వరదల్లో 350కి పైగా ప్రజలు చనిపోగా, వేల కోట్ల ఆస్తినష్టం వాటిల్లింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళతోపాటు అన్ని యూత్ ఫెస్టివల్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంబురాల కోసం అవసరమయ్యే భారీ మొత్తాన్ని వరద సహాయ చర్యలకు తరలించనున్నట్లు తెలిపింది. రూ.30 వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు కేరళ ప్రభుత్వం అంచనా వేసింది. పరిస్థితి పూర్తిగా సమీక్షించిన తర్వాత అధికారిక సంబురాలను రద్దు చేయాలని నిర్ణయించారు. ఏ ప్రభుత్వ శాఖ ఏడాది పాటు ఎలాంటి పండుగ నిర్వహించకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.













