నేటి నుంచి శారదాపీఠంలో చండీయాగం
పెందుర్తి మండలం చినముషిడివాడ లోని విశాఖ శ్రీశారదాపీఠంలో నేటి నుంచి అతిరుద్ర, లక్ష చండీయాగం నిర్వహించనున్నట్లు పీఠం ప్రతినిధులు వెల్లడించారు. పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామీజీ ఆశీస్సులతో, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బారామిరెడ్డి సౌజన్యంతో ఉత్తర పీఠాధిపతి బాలస్వామి ఆధ్వర్యంలో 5 రోజుల పాటు ఈ క్రతువు నిర్వహిస్తామన్నారు. తొలి రోజు స్వామిజీ చేతుల మీదుగా గోపూజ, గణపతి పూజ, దీక్షాధారణ, రుత్విగ్వరణ, అగ్నిమథనం జరుగుతాయని తెలిపారు. ఈ వేడుకలో దేశం నలుమూలల నుంచి నిష్టాతులైన 400 మంది వేద పండితులు పాల్గొంటారన్నారు. దేశానికి రక్షణ కవచంలా ఉంటున్న సైనికులకు, వారి కుటుంబాలకు, దేశానికి వెన్నెముకలా ఉంటున్న రైతుల కుటుంబాలకు ఈ యాగఫలం దక్కాలని స్వామీజీ ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు.













