టీవీల్లో రామాయణం చూడండి…
భారతీయ సంస్కృతికి మూలస్తంభ గ్రంథాల్లో ఒకటైన రామాయణం సీరియల్ మరోసారి భారతీయులను అలరించనుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా హిందువులు ఎంతో ఆసక్తిగా వీక్షించే రామాయణం సీరియల్‌ను మరోసారి టీవీల్లో ప్రసారం చేయాలని కేంద్ర నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రసారశాఖమంత్రి ప్రకాశ్ జవడేకర్ శుక్రవారం ట్విటర్ వేదికగా ప్రకటించారు.
ఎంతో సంతోషంగా ఉంది.. ప్రజల డిమాండ్ మేరకు రామాయణాన్ని మరోసారి టీవీల్లో ప్రచారం చేస్తున్నాం. మార్చి 28 (శనివారం) నుంచి ఈ సీరియల్ ప్రారంభం కాబోతుంది. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, అలాగే సాయంత్రం 9 నుంచి 10 గంటల వరకు డీడీ నేషనల్ (దూరదర్శన్) చానల్లో ప్రసారం కానుంది’ అని కేంద్రమంత్రి తెలిపారు. కాగా తొలిసారి రామాయణం సీరియల్ 1987 నుంచి 1988 మధ్య కాలంలో దూరదర్శన్‌లో ప్రసారమైన విషయం తెలిసిందే. ఈ సీరియల్ ఇండియన్ టెలివిజన్ రేటింగ్స్‌లో ఓ సంచలనంగా నిలిచింది. ఎంతోమంది ఆదరాభిమానాలను సొంతం చేసుకుని టెలివిజన్ రంగంలో ఓ మైలురాయిగా నిలిచింది.













