YS Vivekananda Reddy: వివేకా హత్య కేసులో సునీతకు ఊరట ఇచ్చిన సుప్రీంకోర్టు

వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో మరోసారి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆయన కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత (Dr. Narreddy Sunitha)కు సుప్రీంకోర్టు (Supreme Court) ఊరట ఇచ్చింది. గతంలో కడప (Kadapa) పోలీసులు సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి (Rajashekar Reddy)తో పాటు అప్పట్లో విచారణ చేపట్టిన సీబీఐ (CBI) అధికారి రాంసింగ్ (Ram Singh)పై కేసులు నమోదు చేశారు. వీటిని సవాల్ చేస్తూ ముగ్గురూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీర్ఘకాలం వాదనలు విన్న సుప్రీంకోర్టు తాజాగా ఈ కేసులను కొట్టి వేసింది.
మొదట ఈ కేసు విచారణ సమయంలో ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) అనుచరులు పులివెందుల (Pulivendula) పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను బలవంతంగా అరెస్టు చేస్తూ, హత్యను ఒప్పుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సీబీఐ ఏఎస్పీ రాంసింగ్‌పై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు పంపారు. అదేవిధంగా వివేకా హత్య వెనుక సునీత దంపతుల ప్రమేయం ఉందని మరో ఫిర్యాదు రావడంతో మరో కేసు నమోదు అయ్యింది. ఆస్తి వివాదాల కారణంగానే ఈ సంఘటన జరిగిందని, తనపై బెదిరింపులు వస్తున్నాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే సుప్రీంకోర్టు ఈ ఆరోపణల్లో ప్రామాణికత లేదని గుర్తించి కేసులను రద్దు చేసింది.
ఇక మరోవైపు, వివేకా హత్య కేసులో ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డి సహా పలువురు నిందితులు బెయిల్‌పై బయట ఉన్నారు. వీరి బెయిల్ రద్దు చేయాలని సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సునీత తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా (Siddharth Luthra) వాదనలు వినిపించారు. ఆయన మాట్లాడుతూ, ఈ కేసులో ఇంకా స్పష్టత రాని అనేక అంశాలు ఉన్నాయని కోర్టుకు వివరించారు.
లూథ్రా వాదనలో, వివేకా మరణాన్ని గుండెపోటుగా చూపించేందుకు ప్రయత్నం జరిగిందని, నిజానికి అది హత్య అని, దీని వెనుక అసలు కారణాలు వెలుగులోకి రావాల్సి ఉందని అన్నారు. ఈ ఘటనలో ముఖ్య పాత్రధారులు ఎవరన్నది, హత్యకు ప్రేరేపించిన వారు ఎవరో గుర్తించడం అవసరమని స్పష్టం చేశారు. సాక్షులను బెదిరించే ప్రయత్నాలు, సాక్ష్యాలను నాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
సీబీఐ అధికారులు గత విచారణ సమయంలో కేసు దర్యాప్తు పూర్తయిందని కోర్టుకు చెప్పిన విషయాన్ని సునీత తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. సుప్రీంకోర్టు విధించిన గడువు కారణంగానే విచారణ పూర్తి అయిందని వారు అలా నివేదించారని వాదించారు.ఈ కేసులో నిజం పూర్తిగా బయటకు రావాల్సిన అవసరం ఉందని, కేవలం విచారణ ముగిసిందని చెప్పడం సరిపోదని సునీత తరఫు న్యాయవాదులు స్పష్టం చేస్తున్నారు. సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చే వరకు ఈ కేసు విషయంలో ఎటువంటి స్పష్టత రాదు. గత కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న ఈ కేసు ఎప్పుడు ముగుస్తుంది అన్న విషయం ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతుంది.