దేశప్రతిష్టతో ఆటలా?
భారత రెజ్లర్ల ఆందోళన అరణ్యరోధన అవుతోందా? రెజ్లర్ల సమస్యలు పరిష్కారమయ్యే పరిస్థితులు గోచరించడం లేదా? రెజ్లర్లు, కేంద్రం తెగేదాకా లాగుతున్నాయా? వీరిద్దరి మధ్య పోరులో దేశ ప్రతిష్ట బజారున పడుతోందా? తాజా పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. తమ సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. దేశంకోసం అంతర్జాతీయ వేదికలపై పోరాడాల్సిన తాము.. తమ సమస్యను నెరవేర్చాలంటూ వీధిపోరాటం చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. అంతే కాదు.. తమ సమస్యలు పరిష్కారమైతేనే ఆసియా క్రీడల్లో పాల్గొంటామని తేల్చి చెప్పారు.
రెజ్లర్లు మానసికంగా రోజు రోజుకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఒలింపియన్ సాక్షిమాలిక్ ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఈ విషయం ఎవరికీ అర్థం కావడం లేదన్నారు.ఈ సమస్యలన్నీ పరిష్కారమైతేనే ఆసియా క్రీడల్లో పాల్గొంటాం. మానసికంగా మేం మానసిక క్షోభ అనుభవిస్తున్నాం. అని రెజ్లర్ల భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడానికి మహాపంచాయత్ లో పాల్గొనేందుకు వచ్చిన సాక్షి మాలిక్.. తమ నిర్ణయాన్ని వెల్లడించారు.
మరోవైపు..మహిళా రెజ్లర్ల నుంచి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్.. 2024 ఎన్నికల్లో తాను మళ్లీ కైసర్‌గంజ్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై తాను కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు. తన సొంత నియోజకవర్గంలో ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు. 2024లో మళ్లీ మోదీ ప్రభుత్వమే వస్తుందని చెప్పారు. కాంగ్రెస్‌పైనా విమర్శలు చేశారు.
ఓవైపు రెజ్లర్ల ఆరోపణలపై సీన్ రిక్రియేషన్ నిర్వహించారు. చట్టం తనపని తాను చేసుకుని పోతుందని.. ఎవరూ చట్టం కన్నా పెద్దవాళ్లు కాదని అమిత్ షా ఇప్పటికే తనను కలిసిన రెజ్లర్లకు స్పష్టం చేశారు. చట్టాన్ని తనపని తాను చేసుకునేలా వ్యవహరించాలన్నారు. మరోవైపు కేంద్రానికి సమయమిస్తూ రెజ్లర్లు తాత్కాలికంగా తమ ఆందోళనను విరమించారు. అయితే .. కేంద్రం వైఖరిని నిశితంగా గమనిస్తున్న రెజ్లర్లు మాత్రం.. దీర్ఘకాలిక ఆందోళనలకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు….రెజ్లర్ల ఆందోళన న్యాయబద్ధమైనదే అంటున్న రైతునేతలు, ఖాప్ పంచాయత్ సహా వివిధ సంఘాల ప్రతినిధులు.. సమస్యలు పరిష్కారం కాకుంటే .. ఉద్యమం మొదలుపెడతామని ఇప్పటికే స్పష్టం చేశారు. రెజ్లర్లకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.













