‘పెరియార్’ రాజకీయాలు
తమిళనాడులో మరోసారి సైద్ధాంతిక విభేదాలు రేగుతున్నాయి. తమిళనాడును ఓఊపు ఊపిన పెరియార్ సిద్ధాంతపరంపరను మరోసారి డీఎంకె బయటకు తెస్తోంది. అంతేకాదు…తమ పార్టీ పునాదులను ప్రస్తుత తరానికి గుర్తు చేసేలా కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగా సీఎం స్టాలిన్ కుమారుడు మంత్రి ఉదయనిధి చేసిన .. మతపరమైన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అవికాస్తా.. బీజేపీ, డీఎంకే మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. అయితే తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నామని ఉదయనిధి స్పష్టం చేశారు.
ఇంతలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు.. అన్నామలై.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే ఆలయాల దగ్గర ఉన్న పెరియార్ విగ్రహాలను తొలగిస్తామన్నారు. అంతేకాదు.. దేవాదాయశాఖను రద్దు చేస్తామన్నారు. దేవుడిని నమ్మేవారంతా మూర్ఖులన్న పెరియార్ విగ్రహాలను తొలగించడమే తమ ప్రథమ ప్రాధాన్యమన్నారు. పెరియార్ స్థానంలో ప్రముఖ సాధువు,పండితుడు తిరువళ్లూర్, ప్రముఖ భాగవతోత్తముల విగ్రహాలు ప్రతిష్టిస్తామన్నారు.
అయితే.. ఈ వ్యాఖ్యలపై ఎంపీ కనిమొళి స్పందించారు. రాష్ట్రంలో బీజేపీ వ్యాఖ్యలు నెరవేర పరిస్థితి లేదన్నారు. తమిళనాడులో బీజేపీ అధికారంలోకి వచ్చేది లేదు.. అన్నామలై కలలు నెరవేరేది లేదన్నారు కనిమొళి. అయితే డీఎంకే తోపాటు అన్నాడీఎంకే సైతం అన్నామలై వ్యాఖ్యలపై మండిపడింది. ఎందుకంటే.. డీఎంకే, అన్నాడీఎంకే నేతలకు పెరియార్ పూజనీయుడు. గురువులాంటి వ్యక్తి కావడమే ఇందుకు కారణం.
ఈరోడ్ వెంకటప్ప రామస్వామి( పెరియార్.. )..ద్రావిడ సిద్ధాంత మూలకర్త. ప్రముఖ నాసిక్తవాది. స్వీయగౌరవమే లక్ష్యంగా జస్టిస్ పార్టీ స్థాపించారు పెరియార్. తర్వాత దానిపేరును ద్రావిడర్ కజగం గామార్చేశారు. బ్రాహ్మణ కులాధిపత్యానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. హిందూమతంలో అస్పృశ్యతను తీవ్రంగా నిరసించారు. దేవుడి పేరు చెప్పి, దోపిడీకి దిగుతున్నారని ఆరోపించారు. దేవుడిని నమ్మేవారు మూర్ఖులని ఘాటుగా విమర్శించారు పెరియార్. స్త్రీ,పురుష బేధబావాన్ని తీవ్రంగా ఖండించారు. హిందీవ్యతిరేక ఉద్యమాన్ని గట్టిగా నడిపారు. ఆపార్టీ నుంచి వేరుపడి ఏర్పడిందే డీఎంకే. డీఎంకే నాయకులతో విభేదించి ఎంజీ రామచంద్రన్.. అన్నా డీఎంకే ఏర్పాటు చేశారు. ఇప్పుడీ రెండు పార్టీలే తమిళనాడు రాజకీయాలను శాసిస్తున్నాయి. అందుకే మూలపురుషుడుగా భావించే పెరియార్ ఆదర్శాలు… ఈపార్టీలకు మేనిఫెస్టో లాంటివి.













