ప్రాంతీయ పార్టీలతో బీజేపీ ఎందుకు పొత్తులు కోరుకుంటోంది..?
ఎన్నికల్లో గెలవడమే రాజకీయ పార్టీల ఏకైక లక్ష్యం. ఇందుకోసం తమ ముందున్న అవకాశాలన్నింటినీ పరిశీలిస్తుంటాయి. ప్రత్యర్థులను ఓడించేందుకు ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తుంటాయి. ఇందుకోసం అవసరమైతే కలిసొచ్చే పార్టీలను కలుపుకుని యుద్ధానికి సిద్ధమవుతుంటాయి. కొన్ని చోట్ల నెగ్గాలంటే తగ్గక తప్పదు కూడా. ఇప్పుడు బీజేపీ కూడా అదే బాటలో పయనిస్తోంది. ఎన్డీయే కూటమని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. సొంతంగానే బీజేపీకి మెజార్టీ ఉన్నా కూటమిని బలోపేతం చేసుకోవడం ద్వారా మరింత స్ట్రాంగ్ గా ఎదగాలనుకుంటోంది కమలదళం.
ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో 38 పార్టీలున్నాయి. 18 రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి సభ్యులు అధికారంలో ఉన్నారు. ప్రస్తుతం ఈ కూటమికి 339 లోక్ సభ స్థానాలున్నాయి. రాజ్యసభలో 118 మంది సభ్యులున్నారు. వచ్చే నెల నాటికి రాజ్యసభలో ఎన్డీయేకి స్పష్టమైన మెజారిటీ రాబోతోంది. ఇక కూటమిలో అతిపెద్ద పార్టీ బీజేపీ మాత్రమే. గత ఎన్నికల్లో బీజేపీకి 290 స్థానాలు వచ్చాయి. మిత్రపక్షాల సపోర్ట్ లేకపోయినా బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేన్ని స్థానాలు ఆ పార్టీకి దక్కాయి. అయినా బీజేపీ మాత్రం అందరినీ కలుపుకునే ముందుకెళ్తోంది.
ఇప్పుడు మళ్లీ పార్లమెంటుకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కూటమిని మరింత బలోపేతం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈసారి కూడా బీజేపీదే అధికారం అని సర్వేలు కోడైకూస్తున్నాయి. అయినా బీజేపీ మాత్రం విపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదనుకుంటోంది. అందుకే మరిన్ని పార్టీలను ఎన్డీయేలోకి ఆహ్వానిస్తోంది. ఈ మధ్య ఎన్డీఏ ఛైర్మన్ అమిత్ షా ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. మరిన్ని పార్టీలూ ఎన్డీయేలోకి రాబోతున్నాయని వెల్లడించారు. టీడీపీ, బీజేడీ, ఆర్ఎల్డీ, శిరోమణీ అకాలీదళ్ లాంటి పార్టీలు ఎన్డీయేలో చేరతాయని సమాచారం.
బీజేపీకి సొంతంగా సీట్లు వచ్చే అవకాశం ఉన్నా మరిన్ని పార్టీలను కూటమిలోకి ఎందుకు చేర్చుకుంటోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈసారి బీజేపీ టార్గెట్ సొంతంగా 370 సీట్లు. అయితే పార్టీలతో పొత్తు లేకుండా సొంతంగా 370 స్థానాలు సాధించడం కష్టం. అందుకే కలిసొచ్చే పార్టీలన్నింటినీ కలుపుకుపోవడం ద్వారా సొంతంగా 370సీట్లు, కూటమికి 400లకు పైగా స్థానాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్టికల్ 370 రద్దుకు గుర్తుగా ఈసారి 370 సీట్ల టార్గెట్ గా పెట్టుకుంది. అందులో భాగమే ఈ పొత్తులు ఎత్తులు.













