Washington: అమెరికాలో ఆటో పెన్ వివాదం.. బైడన్, ట్రంప్ మధ్య సమరం..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(trump), మాజీ ప్రెసిడెంట్ జోబైడెన్(biden) ల మధ్య ప్రత్యక్ష సమరం మొదలైంది. గత పాలక కార్యవర్గం మంజూరుచేసిన క్షమాభిక్షలు చెల్లవంటూ ట్రంప్ ప్రకటించడం దీనికి బీజం వేసింది. నాడు ఇచ్చిన క్షమాభిక్షలన్నిటిపై ఆటోపెన్‌తో సంతకం చేయడం, వాటి గురించి అసలు బైడెన్‌కు ఏమీ తెలియవన్నది ట్రంప్ వాదన. బైడెన్ నిద్ర మత్తులో ఉండగా రాజకీయ దుండగులు చాలామందికి క్షమాభిక్షలు ప్రసాదించారని… అవి చెల్లవని తేల్చిచెప్పారు. వాస్తవానికి నాడు బైడెన్ వృద్ధాప్య కారణాలతో అధ్యక్ష రేసు నుంచి వైదొలిగారు. తాజాగా ఆటోపెన్ వివాదం తెరపైకి రావడంతో అసలు ఆయన ఆరోగ్యం పైనే సందేహాలు వస్తున్నాయి. కానీ, ఇక్కడ బైడెన్ ఆటోపెన్ వాడారా..? లేదా అన్నది కూడా స్పష్టత లేదు. ఇక ట్రంప్ కూడా ఈ వ్యవహారంపై స్వల్పంగా స్వరం మార్చారు. ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ‘‘అది నా నిర్ణయం కాదు.. కోర్టులపై ఆధారపడి ఉంటుంది. కానీ, అవి చెల్లవని నేను చెప్పాను. ఏం జరిగిందనేది బైడెన్‌కు కచ్చితంగా తెలియకపోయి ఉండొచ్చు’’ అని వ్యాఖ్యానించారు.
అసలు ఏమిటీ ఆటోపెన్..?
ఆటోపెన్ అనేది వ్యవహారికంలో వచ్చిన పేరు. డూప్లికేట్ సంతకాలను నిజమైన ఇంకుతో చేసే యంత్రం అది. ఇవి ప్రజాజీవితంలో ఉండే కీలక వ్యక్తులు, సెలబ్రిటీలు వాణిజ్య అవసరాల కోసం భారీ సంఖ్యలో ఆటోగ్రాఫ్‌లు చేయడానికి వాడుతుంటారు. ఒక ప్రింటర్ సైజులో ఉంటుంది. ఇది ఒక సాధారణ పెన్ను లేదా పెన్సిల్‌ను పట్టుకోగలదు. దీనిలో ప్రోగ్రామ్ చేసిన సంతకానికి నకళ్లు రాయగలదు.యూనివర్శిటీలు, గవర్నమెంట్ ఏజెన్సీలు, ఇతర సంస్థల్లో దాదాపు 60 ఏళ్ల నుంచి ఈ ఆటోపెన్ వాడుతున్నట్లు తెలుస్తోంది.
19వ శతాబ్ధం మొదట్లో ఓ ప్రత్యేకమైన పాలిగ్రాఫ్ యంత్రం వాడేవారు. దీంతో రెండు పెన్నులను వాడుతూ రాయడానికి వీలుండేది. 1803లో దీనిపై పేటెంట్ లభించింది. అప్పట్లో థామస్ జెఫర్సన్ ఆయన పదవీకాలం అనంతరం కూడా దీనిని వినియోగించారు. 2005లో అమెరికాలోని జస్టిస్ డిపార్ట్‌మెంట్‌లోని ది ఆఫీస్ ఆఫ్ లీగల్ కౌన్సిల్ మార్గదర్శకాల ప్రకారం ఆటోపెన్ వాడటం చట్టబద్ధమే. గతంలో కూడా చాలామంది అధ్యక్షులు ఆటో పెన్ వినియోగించారు. వీరిలో బరాక్ ఒబామా ది పేట్రియాట్ యాక్ట్‌కు సంబంధించి తీసుకొన్న నిర్ణయంపై ఆటోపెన్ వాడి సంతకం చేయడం నాడు వివాదాస్పదంగా మారింది.