మమత కమాల్.. కమలం ఢమాల్..! ఎలా…?

దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగినా.. అందరి చూపూ పశ్చిమ బెంగాల్ వైపే ఉండేది. పశ్చిమ బెంగాల్ లో మమత కోటను బద్దలు కొట్టాలనేది బీజేపీ టార్గెట్. ఇప్పటికే పదేళ్లు అధికారంలో ఉండడం.. కేంద్రంలో బీజేపీకి కొరకరాని కొయ్యగా మారడంతో అస్త్రశస్త్రాలను సంధించి దీదీ కోటను కొల్లగొట్టాలని ఎన్నో ఏళ్లుగా స్కెచ్ వేస్తూ వచ్చింది కమలం పార్టీ. బీజేపీ నేతలు ఇచ్చిన హైపు, వాళ్లకు మద్దతుగా ఉన్న మీడియా మమత పనైపోయిందంటూ చేసిన హడావుడి చూసి ఏమో.. మమత ఓడిపోతుందేమో.. అని అందరూ భావించారు. బీజేపీ కూడా అధికారంలోకి రాబోతున్నామని.. 200 సీట్లు సాధించబోతున్నామని ప్రకటించింది. కానీ ఫలితాలు వచ్చాయి. సీన్ మొత్తం రివర్స్ అయింది. మమత కంచుకోటను ఏమాత్రం కదిలించలేకపోయింది కమలం పార్టీ. మమతకు ఇది ఎలా సాధ్యమైంది.. ఆమెకు కలిసొచ్చిన అంశాలేంటి.?
2019 పార్లమెంటు ఎన్నికల్లో మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కు 43.3శాతం ఓట్లు దక్కాయి. 22 సీట్లను ఆ పార్టీ దక్కించుకుంది. 2014తో పోల్చితే 12 సీట్లు తగ్గాయి. అదే సమయంలో 2014లో 2 సీట్లు మాత్రమే దక్కించుకున్న బీజేపీ 40.7శాతం ఓట్లతో 18 స్థానాల్లో విజయం సాధించింది. అంటే 16 సీట్లను ఎక్కువగా గెలుచుకుంది. రెండు పార్టీల మధ్య ఓట్ల శాతం కూడా చాలా తక్కువ. దీంతో మమత కంచుకోటను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బద్దలు కొట్టబోతున్నామని బీజేపీ ఘంటాపథంగా చెప్పింది. అది నిజం కాబోతోందని అందరూ నమ్మారు కూడా. కానీ అంచనాలను మించి అసెంబ్లీ ఎన్నికల్లో మమత పార్టీ ఘన విజయం సాధించింది.
2019 పార్లమెంటు ఎన్నికల తర్వాత మమత బెనర్జీ పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. అయితే ఇదే సమయంలో టీఎంసీలో కీలక నేతలను బీజేపీ తనవైపు తిప్పుకుంది. మమత కుడి భుజంగా ఉన్న సువేందు అధికారిని, నందిగ్రామ్ ఏరియాలో పూర్తి ఆధిపత్యం చలాయిస్తున్న ఆయన కుటుంబాన్ని కమలం లాగేసుకుంది. అంతేకాక పలువురు ఎమ్మెల్యేలను, పట్టున్న నేతలను, ఎంపీలను కూడా కమలం ఆకర్షించింది. దీంతో మమత పని ఈసారి అయిపోయిందని అందరూ భావించారు. అయితే మమత మాత్రం ఏమాత్రం ఆందోళన చెందలేదు. పార్టీపై మరింత దృష్టి పెట్టారు. పోయేవాళ్లు పోతేపోనీ.. అంటూ కిందిస్థాయి కేడర్ కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. వాళ్లను లీడర్లుగా మలిచారు. ప్రశాంత్ కిశోర్ సలహాలు కూడా టీఎంసీకి ఎంతో దోహదపడ్డాయి. కేడర్ బలహీనంగా ఉన్నచోట తనే స్వయంగా రంగంలోకి దిగారు. నందిగ్రామ్ లో సువేందుకు మంచి పట్టుందని గ్రహించి ఆ నియోజకవర్గం నుంచి ఆమే స్వయంగా రంగంలోకి దిగారు. తనే అక్కడ పోటీ చేయడం ద్వారా సువేందును ఆ నియోజకవర్గానికి మాత్రమే మమత పరిమితం చేయగలిగారు.
మమత రాజకీయాలు స్ట్రెయిట్ గా ఉంటాయి. ఏదైనా కుండబద్దలు కొట్టినట్లు చెప్తుంది. బీజేపీపై నేరుగా విమర్శలు ఎక్కుపెట్టి ప్రజల్లో ఆలోచన రేకెత్తించేలా చేశారు. బెంగాల్ వాళ్లకు బెంగాల్ వాళ్లే సారథులు కావాలని సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారు. ఢిల్లీ పెత్తనాన్ని ఇక్కడి ప్రజలు సహించబోరని చెప్పారు. తాను పెంచి పెద్ద చేసిన లీడర్లే ఇప్పుడు తనకు వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయారంటూ బీజేపీలోకి వెళ్లిన నేతల తీరును ఎండగట్టారు. బీజేపీకి పగ్గాలు అప్పగిస్తే బెంగాల్ కు నష్టం జరుగుతుందని చెప్పుకొచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. అధికారబలాన్ని ఉపయోగిస్తుందని ఊహించిన మమత ముందుగానే పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. పోలింగ్ బూత్ లలో ఎలాంటి అక్రమాలు జరుగుతాయో ముందే హెచ్చరించడంతో కేడర్ అంతా అలెర్ట్ అయింది. ఇలా కింది స్థాయి వరకూ కేడర్ ను పూర్తిగా ఉత్తేజితం చేయడంలో మమత సక్సెస్ అయింది. అదే సమయంలో బీజేపీ వైఫల్యాలను ఎండగట్టడం, బెంగాల్ కు తృణమూల్ అవసరం ఏంటో వివరించడంలో మమత విజయం సాధించారు.
మమత ఒక వేళ గెలిచినా బొటాబొటి మెజారిటీ మాత్రమే వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే ఏకంగా బీజేపీ అధికారంలోకి రాబోతోందని వెల్లడించాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను పూర్తిగా తలకిందులు చేస్తూ గతం కంటే ఎక్కువగా సీట్లు, ఓట్లు సాధించింది మమత బెనర్జీ. 2011లో తొలిసారి అధికారంలోకి వచ్చింది టీఎంసీ. అప్పుడు ఆ పార్టీకి వచ్చిన ఓట్లు 38.93శాతం. అప్పుడు 184సీట్లు వచ్చాయి. ఆ తర్వాత 2016లో అంతకుమించిన ఓట్లు, సీట్లు సాధించి సత్తా చాటింది మమత. అప్పుడు 44.91శాతం ఓట్లతో 211 సీట్లు సాధించింది తృణమూల్ కాంగ్రెస్. దీంతో మమత చరిష్మా ఏమాత్రం తగ్గలేదని అందరూ పొగిడారు. ఈసారి మాత్రం అంత సీన్ ఉండదని, ఓట్లు, సీట్లు తగ్గుతాయని అంచనా వేశారు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇప్పుడు 48శాతానికి పైగా ఓట్లు సాధించింది టీఎంసీ. అంటే గత ఎన్నికలతో పోల్చితే ఇంకో మూడు శాతం ఓట్లు పెరిగాయి. ఓట్లు మాత్రమే కాదు. గతంలో వచ్చిన 211 సీట్ల కంటే ఎక్కువ సీట్లు సాధించి.. తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు మమత. మొండితనం, ప్రజల్లో ఉండడం, చావోరేవో తేల్చుకోవడం, కేడర్ ను కాపాడుకోవడం, ఎవరు వదిలిపోయినా తాను ఉన్నాననే భరోసా.. మమత స్టెయిల్ రాజకీయం. అవే ఆమెను మరోసారి అధికార పీఠంపై కూర్చోబెట్టాయి.