దటీజ్ ప్రశాంత్ కిశోర్..!

పీకే.. అలియాస్ ప్రశాంత్ కిశోర్..! పొలిటికల్ సర్కిల్స్ ఈ పేరు బాగా పాపులర్. దేశాన్ని నడిపించేది రాజకీయ పార్టీల నేతలైతే.. అలాంటి నేతలంతా కలవరించే పేరు ప్రశాంత్ కిశోర్. ఏ రాష్ట్రంలో అయినా పార్టీ అధికారంలోకి రావాలంటే కచ్చితంగా ప్రశాంత్ కిశోర్ సాయం తీసుకోవాల్సిందే అన్నట్టు తయారైంది పరిస్థితి. అందుకే ఆయన్ను తమ టీమ్ లో జాయిన్ చేసుకునేందుకు ఎన్నో పార్టీలు వెంట పడుతున్నాయి. ఆయన తమ వెంట ఉంటే గెలిచిపోయినట్లే అనే ఫీలింగ్ రాజకీయ పార్టీలది. తాజాగా ప్రశాంత్ కిశోర్ తన స్టామినా ఏంటో చాటుకున్నాడు. ఉత్కంఠ భరితంగా జరుగుతుందనుకున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఫైట్ ను ఒన్ సైడ్ గా మార్చేశాడు. మార్చడం కాదు.. ఈ వార్ వన్ సైడే ఉంటుందని గత డిసెంబర్ లోనే ప్రకటించాడు. అలా కాకుంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశాడు.
పశ్చిమ బెంగాల్ లో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ ప్రయత్నించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ 8 విడతల్లో ఎన్నికలు జరిగాయి. సమస్యాత్మక రాష్ట్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను వాయిదాల పద్ధతిలో నిర్వహించింది. కేంద్రప్రభుత్వం చెప్పినట్లే ఈసీ పని చేస్తోందని టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ ఆరోపించారు. బీజేపీ ఎన్ని కుయుక్తులు పన్నినా గెలుపు తమదేనని ఢంకా భజాయించి చెప్పింది. అయితే ఎగ్జిట్ పోల్స్ చూసాక ఫైట్ రసవత్తరంగా ఉంటుందని భావించారు. మమత గెలుపు అంత ఈజీ కాదని.. ఒకవేళ గెలిచినా బొటాబొటి మెజారిటీ సాధించవచ్చని అందరూ ఊహించారు. ప్రశాంత్ కిశోర్ కు రాజకీయ సన్యాసం తప్పదని అందరూ హేళన చేశారు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో బీజేపీకి డబుల్ డిజిట్ రాదని ప్రశాంత్ కిశోర్ ఛాలెంజ్ చేశారు. అలా గతంలో ఎప్పుడూ ప్రశాంత్ కిశోర్ ప్రకటించలేదు. దీంతో పశ్చిమ బెంగాల్ ఎన్నిక మరింత ఇంట్రస్టింగ్ గా మారింది.
ఇప్పుడు ఫలితాలు దాదాపు వెల్లడయ్యాయి. ప్రశాంత్ కిశోర్ సేవలందిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ బీజేపీకి ఏమాత్రం అందనంత దూరంలో డబుల్ సెంచరీ కొట్టింది. బీజేపీ మాత్రం ప్రశాంక్ కిశోర్ చెప్పినట్లు డబుల్ డిజిట్ కే పరిమితమైపోయింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ తారుమారయ్యాయి. ప్రశాంత్ కిశోర్ అంచనా నిజమైంది. మీడియా మొత్తం బీజేపీ – టీఎంసీ మధ్య ఫైట్ హోరాహోరీగా ఉంటుందని చెప్పినా.. ప్రశాంత్ కిశోర్ మాత్రం బీజేపీకి అంత సీన్ లేదన్నాడు. సాక్షాత్తూ ప్రశాంత్ కిశోరే పశ్చిమ బెంగాల్ లో బీజేపీ గెలుస్తుందని చెప్తున్నట్టుగా ఓ ఆడియో టేపును రిలీజ్ చేశారు కమలం నేతలు. దాన్ని ప్రశాంత్ కిశోర్ ఖండించాడు. తాను డిసెంబర్ లో చెప్పిన డబుల్ డిజిట్ ప్రామిస్ కు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించాడు. ఇప్పుడు తన మాట నెగ్గించుకున్నాడు.
ప్రశాంత్ కిశోర్ పట్టిందల్లా బంగారమే అంటారు విశ్లేషకులు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా అనుకూలంగా మార్చగలగడం ప్రశాంత్ కిశోర్ నైజం. 2019లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి రావడానికి, 2020లో ఢిల్లీలో కేజ్రివాల్ మళ్లీ పగ్గాలు చేపట్టడానికి ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ మళ్లీ పీఠం అధిష్టించడానికి ప్రశాంత్ కిశోర్ వ్యూహాలే కారణం. వచ్చే ఏడాది పంజాబ్ లో జరిగే ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్నారు. నాడు కోడికత్తితో జగన్ ను అధికారంలోకి తెచ్చిన ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు కాలికి కట్టుతో మమతను గద్దెనెక్కిస్తున్నారంటూ సోషల్ మీడియాలో సెటైర్లు జోరుగా సాగుతున్నాయి.