మమత సర్కార్ ను ఎత్తిపాడేయడమే లక్ష్యం
బెంగాల్ నుంచి మమత సర్కార్‌ను ఎత్తిపాడేయడమే తమ ముందున్న లక్ష్యమని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బల్లగుద్ది చెప్పారు. అందులో మరోమాట ఏమీలేదని స్పష్టం చేశారు. బెంగాల్లో ఉన్న సమస్యల నుంచి ఆమె పారిపోలేరని, తాము నిరంతరం సమస్యలను లేవదీస్తూనే ఉంటామని ఆయన ప్రకటించారు. తాము గనక అధికారంలోకి వస్తే కచ్చితంగా రాష్ట్ర రాజకీయాలను మార్చేస్తామని, ‘సోనార్ బెంగాల్’ను చేసి చూపిస్తామని పునరుద్ఘాటించారు. ఓ జాతీయ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. తాము గనక అధికారంలోకి వస్తే ప్రజలు తమకు ఇష్టం వచ్చిన ధర్మాన్ని బెదురు లేకుండా చేసుకోవచ్చని, అలాంటి పాలన అందిస్తామని హామీ ఇచ్చారు.
పరివర్తన్ అంటే సీఎం మార్పు కాదు..
తాము రాష్ట్రంలో ‘పరివర్తన్’ర్యాలీ నిర్వహిస్తున్నామని, దానర్థం కేవలం సీఎం మార్పు మాత్రమే కాదని షా స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రభుత్వాన్ని కూడా మార్చడం కాదన్నారు. బెంగాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను పూర్తిగా మార్చాలన్న లక్ష్యంతోనే ఈ యాత్ర అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మార్పే కోరుకుంటున్నారని, వారి వారి ఆశయాలకు అనుగుణంగా ప్రజాస్వామ్య బద్ధంగా పరివర్తన తెచ్చి చూపిస్తామని ఆయన పేర్కొన్నారు. బెంగాల్ ప్రజలు బీజేపీతోనే ఉన్నారని, ఎందుకంటే ప్రస్తుత వాతావరణం వారికి నచ్చడం లేదని షా తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాము కచ్చితంగా 200 సీట్లకు పైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
సీఎం మమత కూడా ఇలాంటి ధీమాయే ప్రకటించారని ప్రశ్నించగా…. ఫలితాలు చెబుతాయి కదా… అని షా పేర్కొన్నారు. తృణమూల్ సర్కార్ తమకు ఎన్నిఇబ్బందులకు గురి చేసినా, తాము మాత్రం అనుకున్న లక్ష్యాన్ని చేరి తీరుతామని ధీమాగా ప్రకటించారు. శాంతిభద్రతల సమస్య అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, ఆ అంశాన్ని మమత సర్కారే చూసుకోవాలని ఆయన పేర్కొన్నారు. అల్లర్లు, విధ్వంసాలకు దిగడం బెంగాలీ సంస్కృతే కాదని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడైతే వామపక్షాలు ఏలుతాయో అక్కడ విధ్వసం కాండ ప్రళయ తాండవం చేస్తుందని విరుచుకుపడ్డారు. గత 35 సంవత్సరాల నుంచే ఇలాంటి వాతావరణం బెంగాల్లో ఉందని, దీనిని త్వరలోనే మార్చేస్తామని షా ప్రకటించారు.
ప్రజలు ఎలాంటి నినాదాలనైతే కోరుకుంటారో… ప్రచార పర్వంలో తాము అలాంటి నినాదాలనే ఇస్తామని ప్రకటించారు. జైశ్రీరాం అన్న నినాదానికి మమత ఎందుకు చిర్రెత్తిపోతున్నారో తమకు అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. జైశ్రీరాం అన్న నినాదం ధర్మానికి సంబంధించి అని, దానిని మతపరమైన నినాదంగా మమత సర్కార్ మార్చేసిందని, ఇందుకు బెంగాల్ ప్రజలు వారిని ఎన్నటికీ క్షమించరని హెచ్చరించారు.
బుజ్జగింపు రాజకీయాల కోసమే మమత జైశ్రీరాం అని నినదించడం లేదని ఆరోపించారు. జైశ్రీరాం అనేది పరివర్తనకు మారుపేరుగా నిలుస్తుందన్నారు. జైశ్రీరాం అయినా, ఇంక్విలాబ్ జిందాబాద్ అయినా, భారత్ మాతాకీ జై అయినా.. ప్రజలు కోరుకున్నవే అని, అందుకే ఇంతలా ప్రచారంలోకి వస్తున్నాయని ఆయన తెలిపారు. ఒకవేళ ఇవి రాజకీయ నినాదాలు అయితే ఎప్పటికో మాసిపోయేవని వివరించారు. సంస్కృతి, ఎన్నికలు అనేవి అవినాభావ సంబంధం ఉంటుందని, అవేమీ వేర్వేరు కాదని అన్నారు. సంస్కృతి అనేది ఇప్పుడు ఎన్నికల అంశంగా మారిందని, తమ ప్రధాన అజెండా బెంగాల్ సంస్కృతి అని ఆయన ప్రకటించారు.
తమ ఎన్నికల ప్రచారంలో సంస్కృతి అంశాలతో పాటు సామాజిక, ఆర్థిక అంశాలను కూడా జోడిస్తామని అమిత్‌షా స్పష్టం చేశారు.













