‘విష్ణుదేవ్ సాయ్’ కే పట్టం
అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సీనియర్ గిరిజన నేత విష్ణుదేవ్ సాయ్.. చత్తీస్ గఢ్ సీఎంగా ఎన్నికయ్యారు. మూడు సార్లు సీఎం, ఈసారి ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపిన రమణ్ సింగ్ ను పక్కనపెట్టి మరీ… విష్ణుదేవ్ కు బీజేపీ హైకమాండ్ పట్టం కట్టింది. రమణ్ సింగ్ కు అసెంబ్లీ స్పీకర్ పదవి వరించింది. అయితే మోడీ-షా నిర్ణయం కమలనాధులను విస్మయపరిచిందనే చెప్పాలి. సామాజిక సమతుల్యంలో భాగంగా ఇద్దరు ఉపముఖ్యమంత్రులను కూడా నియమించింది. ఓబీసీ నేత, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ సావో, సీనియర్ నేత విజయ్ శర్మలకు ఆ పదవులు ఇచ్చింది.
కేంద్ర నాయకత్వం సాయ్‌ను సారథిగా ఖరారుచేసినట్లు ముండా ప్రకటించగానే పార్టీ ఎమ్మెల్యేలంతా ఆయన్ను తమ నేతగా ఎన్నుకున్నారు. అనంతరం సావో సారథ్యంలోని బీజేపీ బృందం .. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసింది. సాయ్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న విషయాన్ని లేఖ రూపంలో నివేదించింది. దీంతో సాయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు. ఆయన్ను సీఎంగా నియమిస్తూ నియామక పత్రాన్ని కూడా అందజేశారు. తనను ముఖ్యమంత్రిగా నియమించినందుకు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు సాయ్. అధికారం చేపట్టగానే పేదలకు 18 లక్షల ఇళ్లు మంజూరు చేస్తానని, మోడీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానన్నారు.
విష్ణుదేవ్ సాయి… గిరిజనుల్లో అత్యంత పలుకుబడిగల సాహు (తేలీ) వర్గానికి చెందినవారు. బిలా్‌సపూర్, దుర్గ్, రాయ్‌పూర్ ప్రాంతాల్లో ఈ వర్గం వారు అత్యధికంగా ఉంటారు. ఆయన రాజకీయ కుటుంబం నుంచే వచ్చారు. తాత బుద్ధనాథ్ సాయి 1947-52 నడుమ నామినేటెడ్ ఎమ్మెల్యేగా పనిచేశారు. సాయి పెదనాన్న నరహరి ప్రసాద్ సాయి బీజేపీ పూర్వరూపమైన జన్‌సంఘ్ నేత. 1962-67, 72-77ల్లో రెండు సార్లు ఎమ్మెల్యేగా, 1977-79 మధ్య ఎంపీగా, జనతా పార్టీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగానూ ఉన్నారు.
విష్ణుదేవ్ జశ్పూర్ జిల్లా కుంకురిలో ప్రభుత్వ పాఠశాలలో చదివారు. డిగ్రీ మధ్యలోనే చదువు మానేశారు. బీజేపీ దివంగత సీనియర్ నేత దిలీప్ సింగ్ జుదేవ్ ప్రోద్బలంతో రాజకీయాల్లోకి వచ్చారు. 1990లో సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే ఏడాది అవిభక్త మధ్యప్రదేశ్‌లోని తప్కరా నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 1999 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌పూర్ నుంచి గెలిచారు. వరుసగా 2004, 2009, 2014ల్లో కూడా ఎన్నికయ్యారు. 2014లో మోడీ మొదటి ప్రభుత్వంలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. సుసంపన్న రాజకీయ వారసత్వం ఉన్నప్పటికీ పార్టీకి సాయ్ ఎప్పుడూ పార్టీకి విధేయుడే. అంకితభావం కలిగిన నేత. లక్ష్య సాధనలో ముందుంటారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగానూ దీర్ఘకాలం పనిచేశారు.













