Vandemataram : వందేమాతరం రచ్చ: నెహ్రూ ద్రోహమా? బెంగాల్ ఎన్నికల వ్యూహమా?
దేశంలో మరోసారి భావోద్వేగ రాజకీయాలకు తెరలేచింది. స్వాతంత్ర్యోద్యమ కాలంలో భారతీయుల నరనరాల్లో దేశభక్తిని నింపిన వందేమాతరం గీతం, ఇప్పుడు పార్లమెంటు సాక్షిగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. నెహ్రూ దీనికి ద్రోహం చేశారని బీజేపీ ఆరోపిస్తుండగా, ఇది కేవలం బెంగాల్ ఎన్నికల కోసమే ఆడుతున్న నాటకమని కాంగ్రెస్ కొట్టిపారేస్తోంది. అసలు ఇప్పుడీ వివాదం ఎందుకు తెరపైకి వచ్చింది? దీని వెనుక ఉన్న అసలు కథేంటి?
తాజా పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బీజేపీ ఎంపీలు వందేమాతరం అంశాన్ని లేవనెత్తడంతో సభ వేడెక్కింది. స్వాతంత్ర్య పోరాటంలో ప్రజలను ఏకం చేసిన బంకించంద్ర చటర్జీ రచించిన ‘వందేమాతరం’ గీతమే నిజానికి మన ‘జాతీయ గీతం’ (National Anthem) కావాలనేది బీజేపీ మాట. కానీ, నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మైనారిటీలను సంతృప్తి పరచడం కోసం, లౌకికవాదం పేరుతో వందేమాతరాన్ని పక్కనబెట్టి, ‘జనగణమన’ను ఎంపిక చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. నెహ్రూ తీసుకున్న ఆ నిర్ణయం దేశానికి, ఆ గీతానికి చేసిన ద్రోహమని, ఇప్పుడు ఆ చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దాల్సిన సమయం ఆసన్నమైందని వారు వాదిస్తున్నారు. వందేమాతరం పట్ల కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ చిన్నచూపేనని విమర్శిస్తున్నారు.
బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు తీవ్రంగా తిప్పికొట్టాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనే బీజేపీకి ‘వందేమాతరం’ గుర్తుకు వచ్చిందని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. బంకించంద్ర చటర్జీ బెంగాల్ గడ్డపై పుట్టిన మహనీయుడు. బెంగాల్ ప్రజల సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి, ఓట్లు దండుకునేందుకే బీజేపీ ఈ పాత వివాదాన్ని కొత్తగా తెరపైకి తెచ్చిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. జాతీయ గీతం జనగణమన, జాతీయ గేయం వందేమాతరం రెండూ సమాన గౌరవం కలిగినవేనని, రాజ్యాంగ సభ ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు నెహ్రూపై రుద్దడం అర్థరహితమని హస్తం పార్టీ వాదిస్తోంది.
ఈ సమయంలో వందేమాతరం చర్చను లేవనెత్తడం వెనుక బీజేపీకి స్పష్టమైన బహుముఖ వ్యూహం ఉందనేది విశ్లేషకులు చెప్తున్న మాట. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని ఢీకొట్టాలంటే బలమైన సాంస్కృతిక అస్త్రం కావాలి. బెంగాలీ అయిన బంకించంద్ర చటర్జీ రాసిన గీతానికి అన్యాయం జరిగిందని చెప్పడం ద్వారా, బెంగాలీ అస్తిత్వాన్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. వందేమాతరం అనేది కేవలం పాట కాదు, అదొక హిందుత్వ భావోద్వేగం. దీనిపై చర్చ జరగడం వల్ల హిందూ ఓటు బ్యాంకు ఏకీకృతమవుతుందని, ప్రతిపక్షాలను దేశభక్తి వ్యతిరేకులుగా ముద్ర వేయవచ్చని బీజేపీ భావిస్తోంది. కాంగ్రెస్ మూలస్తంభమైన నెహ్రూ నిర్ణయాలను ప్రశ్నించడం ద్వారా, ప్రస్తుత కాంగ్రెస్ నాయకత్వాన్ని ఆత్మరక్షణలో పడేయడం మరో ఎత్తుగడ.
సామాన్య ప్రజల కోణంలో ఆలోచిస్తే.. ప్రస్తుతం దేశం ఎన్నో తీవ్రమైన సమస్యలతో సతమతమవుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నిరుద్యోగం యువతను వేధిస్తోంది. రూపాయి విలువ పతనం, ఆర్థిక మందగమనం ఆందోళన కలిగిస్తున్నాయి. మణిపూర్ వంటి రాష్ట్రాల్లో శాంతిభద్రతల సమస్యలు ఉన్నాయి. ఇండిగో సమస్య దేశాన్ని ఊపేస్తోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, పార్లమెంటులో ప్రజా సమస్యలపై చర్చ జరగాలి. కానీ, దశాబ్దాల క్రితం పరిష్కారమైన, రాజ్యాంగం ఆమోదించిన అంశాలను ఇప్పుడు తవ్వి తీయడం వల్ల సామాన్యుడికి ఒరిగేదేమీ లేదు. పాత చింతకాయ పచ్చడి లాంటి ఈ వివాదాలు కేవలం ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించేందుకే ఉపయోగపడుతున్నాయని మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వందేమాతరం భారతీయుల గుండె చప్పుడు. దానిపై ఎవరికీ ద్వేషం లేదు, ఉండకూడదు. కానీ, రాజకీయ లాభాల కోసం, ఎన్నికల అవసరాల కోసం ఆ పవిత్ర గీతాన్ని వివాదాస్పదం చేయడం ఎంతవరకు సమంజసం? చరిత్రను సమీక్షించడం తప్పు కాదు, కానీ వర్తమాన సమస్యలను గాలికి వదిలేసి, గతంలోనే జీవించడం దేశ ప్రగతికి ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. పార్లమెంటు అనేది భవిష్యత్తును నిర్మించే వేదిక కావాలి కానీ, గతాన్ని తవ్వే గడ్డపార కాకూడదు.






