ట్రంప్ వర్సెస్ హారిస్… అంతుచిక్కని అమెరికన్ ఓటర్
ప్రపంచం ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కేవలం రెండువారాల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఎన్నికల్లో గెలిచేందుకు గానూ.. ఇద్దరు నేతలు నెలరోజులుగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మొదట్లో ట్రంప్ ఆధిక్యంలో ఉండగా.. హారిస్ బరిలోకి దిగాక త్రాసు హారిస్ వైపు మొగ్గింది. అయితే మళ్లీ ట్రంప్.. స్వల్ప ఆధిక్యంలోకి దూసుకొచ్చారు. దీంతో ఓ వర్గం సర్వేలు ట్రంప్ వైపు… మరో వర్గం సర్వేలు హారిస్ వైపు నిలుస్తున్నాయి.
అయితే…ట్రంప్, హారిస్ మధ్య హోరాహోరీ పోరు ఖాయమని, ఎవరు విజయం సాధించిన స్వల్ప తేడానే ఉంటుందని చెబుతున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ నిర్వహించిన సర్వేలో కమలా హారిస్ కంటే డొనాల్డ్ ట్రంప్ కాస్త ముందంజలో ఉన్నట్లు తేలింది. ట్రంప్ నకు 47శాతం, హారిస్ కు 45శాతం మంది ఆదరణ లభిస్తుందని, సర్వే మార్జిన్ ప్లస్ లేదా మైనస్ 2.5శాతం ఉండొచ్చని వాల్ స్ట్రీట్ సర్వే అంచనా వేసింది. అయితే అంతకు ముందు చాలా సర్వేలు.. ట్రంప్ పై హారిస్ 2 కన్నా ఎక్కువశాతం ఆదరణ సాధించారని తెలిపాయి . దీంతో సర్వేల్లో సైతం .. ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఎవరి మద్దతు దారులు.. వారి పార్టీ, వారినేతే గెలుస్తారన్న విశ్వాసంతో ఉన్నారు.
మరోవైపు…. కమలా హారిస్ పై ట్రంప్ మరోసారి వ్యక్తిగత విమర్శలు చేశారు. హారిస్ అధికారంలోకి వస్తే చైనా ఆమెను చిన్న పిల్ల మాదిరి ఆడేసుకుంటుందంటూ సెటైర్లు వేశారు. ఓ బిగినర్ తో గ్రాండ్ మాస్టర్ గేమ్ ఆడుకుంటున్నట్లుగా బీజింగ్ ప్రవర్తన ఉంటుందని ట్రంప్ పేర్కొన్నారు. ప్రతిగా ట్రంప్ అసమర్థుడని హారిస్ ఘాటుగా బదులిచ్చారు. ఆయనకు దేశాన్ని నడిపించే సామర్థ్యం లేదన్నారు. అంతేకాదు..ట్రంప్ ను అడాల్ఫ్ హిట్లర్ తో పోల్చారు హారిస్. మరోవైపు….తాజాగా ట్రంప్ కు బిగ్ షాక్ తగిలింది. 23 మంది నోబెల్ గ్రహీతలు కమలాహారిస్ ఆర్థిక ప్రణాళికకు కితాబిచ్చారు. ఇటీవల నోబెల్ బహుమతి పొందిన సిమస్ జాన్సన్, డారెన్ ఏస్మోగ్లులు కూడా ఈ జాబితాలో ఉండటం గమనార్హం. ఈ మేరకు వారంతా కలిసి ఓ లేఖనుసైతం విడుదల చేశారు.
ఆర్థిక విధానాలపై ప్రతిఒక్కరికి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ.. మొత్తం హారిస్ ఆర్థిక ఎజెండా అమెరికా అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. ఆరోగ్యం, పెట్టుబడి, సుస్థిరత, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తుందని, ప్రతికూల ఆర్థిక వ్యవస్థ కంటే గొప్పగా ఉంటుందని మేము నమ్ముతున్నామని పేర్కొన్నారు. 2010లో తన మార్కెట్ ఎకనామిక్స్ పరిశోధన కోసం నోబెల్ బహుమతిని గెలుచుకున్న జోసెప్ స్టిగ్లిట్జ్ ఉమ్మడి ఆమోదానికి నాయకత్వం వహించారు. డొనాల్డ్ ట్రంప్ ప్రణాళిక అధిక ధరలకు, ఎక్కువ అసమానతలకు దారి తీస్తోందని చెప్పారు. క్లుప్తంగా చెప్పాలంటే.. హారిస్ విధానాలు మరింత పటిష్టమైన, మరింత స్థిరమైన, మరింత సమానమైన ఆర్థిక వృద్ధితో బలమైన ఆర్థిక పనితీరును కలిగిస్తాయని లేఖలో వారు పేర్కొన్నారు.






