రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో…
ప్రపంచానికి పెద్దన్న.. ఒక్కమాట చెబితే చాలు ప్రపంచదేశాలు తలొగ్గి వింటాయి. అంతటి శక్తిమంతమైన దేశానికి …వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. డెమొక్రాట్ల తరపున ప్రస్తుత అధ్యక్షుడు బిడెన్.. పోటీలో ఉన్నారు. మరి గ్రాండ్ ఓల్డ్ పార్టీ రిపబ్లికన్ల తరపున అభ్యర్థికోసం రేసు కొనసాగుతోంది. ఈరేసులో మాజీ అధ్యక్షుడు ట్రంప్ ముందంజలో ఉన్నారు. ఆయన తర్వాతి స్థానాల్లో నిక్కీహేలీ, రామస్వామి, డిసాంటిస్, క్రిస్టీ కొనసాగుతున్నారు. ఇప్పటికి నాలుగు ప్రెసిడెన్షియల్ డిబేట్లు జరిగాయి. అయితే వీటిలో ప్రస్తుతం నిక్కీ హేలీ, రామస్వామి మిగిలిన వారికన్నా ముందున్నారు.
ట్రంప్ పై రిపబ్లికన్ ఓటర్లకు భారీ అంచనాలున్నాయి. అయితే తనపై ఉన్న కేసుల్లో న్యాయపోరాటం చేస్తున్నారు ట్రంప్. ట్రంప్ పై ఉన్న కేసుల నుంచి బయటపడితే.. ఈ మాజీ అధ్యక్షుడికి సొంతపార్టీలో తిరుగులేదని చెప్పొచ్చు. మరోవైపు.. బిడెన్ కు వార్ధక్యం ఓ సమస్యగా మారింది. ఆయన పోటీ చేస్తున్నా.. చాలా వరకూ సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంది. అయితే మరో సరైన అభ్యర్థి బరిలో నిలవకపోవడంతో.. బిడెన్ కు అభ్యర్థిత్వ సమస్య లేదు.
ఇటు.. రిపబ్లికన్ల విషయానికి వస్తే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తర్వాత.. రేసులో నిక్కీ హేలీ ముందంజలో ఉన్నారు. గతంలో ఐక్యరాజ్యసమితి రాయబారిగా పనిచేసిన ఆమె పేరు అధ్యక్ష రేసులో జోరుగా వినిపిస్తోంది. ప్రధానంగా మిల్వాకీ, శాన్ఫ్రాన్సిస్కో, ఫ్లోరిడాల్లో GOP నిర్వహించిన అధ్యక్ష చర్చల్లో ఆమె వ్యవహరించిన తీరుకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది.జో బైడెన్ తర్వాత అధ్యక్ష పీఠాన్ని అందుకునేందుకు తానే సరైన, ధృఢమైన వ్యక్తినని ఆమె బలంగా చెబుతున్నారు.
నిక్కీ హేలీ భారత సంతతి పౌరురాలు. సిక్కుసామాజిక వర్గానికి చెందిన హేలీ తల్లిదండ్రులు.. కెనడా నుంచి అమెరికాకు వలస వెళ్లారు. నిక్కీ తండ్రి బయోలజిస్టు. ఆమె తల్లి ప్రముఖ లాయర్. తర్వాత కాలంలో బొటెక్ షాప్ ఓనర్‌గా మారారు. ప్రస్తుతం ఈ వ్యాపారం మిలియన్ డాలర్లలో సాగుతోంది. మూడో డిబెట్ తర్వాత ఆమె 11 బిలియన్ డాలర్లు ఫండంగ్ సాధించారు.. నిజానికి అమెరికాకు వచ్చిన సమయంలో వీరి వద్ద 8 డాలర్లు మాత్రమే ఉండడం మరో విశేషం. వివేక్ రామస్వామి..పోటీలో మరో ప్రధాన పోటీదారుగా ఉన్నారు. తొలి రెండు డిబేట్లలో మంచి పనితీరు కనబర్చారు. అయితే క్రమంగా డిబేట్ల సంఖ్య పెరుగుతున్నకొద్దీ.. ఆయన రేటింగ్ పెద్దగా పెరగడం లేదు.
ముఖ్యంగా నాలుగో డిబేట్ లో రామస్వామి.. నిక్కీహేలీని పర్సనల్ గా టార్గెట్ చేశారు.ఆమె అవినీతి పరురాలన్నారు. పెట్టుబడి దారుల నుంచి భారీగా ఫండ్స్ వసూలు చేశారని ఆరోపించారు. ఈ విమర్శలకు అప్పుడు మౌనం దాల్చిన నిక్కీ..తర్వాత తనకు పెట్టుబడిదారుల మద్దతు పెరుగుతోందన్న అక్కసు రామస్వామిలో కనిపిస్తోందన్నారు. ఈ డిబేట్లను నిశితంగా గమనిస్తే నిక్కీ హేలికి ఆమె విదేశాంగ విధానం ప్లస్ గా మారుతోంది. ముఖ్యంగా ఉక్రెయిన్ పోరు, ఇజ్రాయెల్ దాడుల విషయంలో మిత్రపక్షాలకే ఆమె మద్దతిచ్చారు.
అయితే ఫండింగ్ విషయంలో మాత్రం విమర్శలు వెల్లువెత్తడం కాస్త ఇబ్బందికరంగా మారుతోంది. ఇక వివేక్ రామస్వామి విషయంలో ఆయనకు విదేశాంగ విధానం ఓ అవరోదంలా మారింది. ముఖ్యంగా అమెరికా డబ్బు.. ఉక్రెయిన్ కు ఎందుకివ్వడం, ఇజ్రాయెల్ దాడుల విషంలో కూడా ఆయన వ్యాఖ్యలు.. అమెరికన్లలో చర్చనీయాంశమైంది. ఇప్పటికీ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కు ఎవరూ దరిదాపుల్లోలేరు.. అందుకే ట్రంప్… కనీసం డిబేట్లలో సైతం పాల్గొనడం లేదు. అయితే రిపబ్లికన్ ఓటర్లలో అత్యధిక శాతం మంది .. ట్రంప్ గెలుపుఖాయమని విశ్వసిస్తున్నారు. ఓవేళ ట్రంప్ కు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలిన పక్షంలో నిక్కీ హేలికి అవకాశం దక్కే అవకాశముంది.






