అమెరికా-భారత్ సంబంధాలలో సరి కొత్త అధ్యాయం
అమెరికా-భారత్ ద్వైపాక్షిక బంధం మరింత బలోపేతమవుతోంది. జి-20 సదస్సులో భాగంగా అమెరికా అధ్యక్షుడు బిడెన్- భారత ప్రధాని నరేంద్రమోడీ మధ్య 5 కీలక ఒప్పందాలు కుదిరాయి. ఢిల్లీలోని లోక్‌కళ్యాణ్ మార్గ్-7లో ఆర్థిక, ప్రజా సంబంధాలు పెంపొందించే అంశాలపై చర్చించారు. తమ భేటీ ఫలప్రదం అయ్యిందని ఇద్దరు నేతలు సంయుక్త ప్రకటనలో తెలిపారు. మన దేశాల మధ్య స్నేహం, ప్రపంచానికి మేలు చెయ్యడంలో కీలక పాత్ర పోషిస్తుంది అని మోడీ ట్వీట్లో వెల్లడించారు.
ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. జెట్ ఇంజిన్ డీల్..దీనిలో భాగంగా ఇరుదేశాలు సంయుక్తంగా జెట్ ఇంజిన్లను తయారు చేస్తాయి. ఇది చాలా చెప్పుకోదగినది. ఎందుకంటే.. యుద్ధవిమానాల ఇంజిన్లను భారత్.. ఇప్పటికీ దిగుమతి చెేసుకుంటోంది. ఆయా దేశాలు ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి తప్ప, సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి అంగీకరించడం లేదు. ఈ ఒప్పందంతో భారత్ కు సాంకేతిక పరిజ్ఞానం బదిలీ అవుతుంది.
రక్షణరంగంలో డ్రోన్లకు సంబంధించి ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. యుద్ధరంగంలో ఇప్పుడు డ్రోన్లు చాలా కీలకంగా మారాయి. తక్కువ పెట్టుబడితో శత్రువు వ్యూహాత్మక ప్రదేశాలు,ఆయుధ డిపోలు, కార్యాలయాలపై దాడులు చేయడానికి డ్రోన్లు ఎంతో అనుకూలం. దీంతో అన్ని దేశాలు డ్రోన్లపై ఫోకస్ పెట్టాయి. దీనిలో భాగంగా ఇండియా .. అమెరికా నుంచి 31 అత్యాధునిక డ్రోన్లను ఖరీదు చేయనుంది. వీటిని ఇండియాలోనే తయారు చేస్తారు. దీని ద్వారా భారత రక్షణ రంగం మరింత బలోపేతం కానుంది.
ఇప్పుడు ప్రపంచమంతా సమాచార విప్లవం ఆధారంగా ముందుకెళ్తోంది. అందులోనూ వివిధ ఎలక్ట్రానిక్ ఎక్విప్ మెంట్స్ తయారీతో దేశాలు అభివృద్ధిపరంగా దూసుకెళ్తున్నాయి. దీనిలో భాగంగా అమెరికా ఇండియా మధ్య సెమీ కండక్టర్స్ గురించి మరో ఒప్పందం కుదిరింది. దీంతో పలు సాఫ్ట్ వేర్ కంపెనీలు, అంతర్జాతీయ మొబైల్ సంస్థలకు లబ్ధి చేకూరనుంది. మేకింగ్ ఇండియాకు బూస్ట్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
చంద్రయాన్ -3, ఆదిత్య ఎల్-1 విజయాల మీదున్న ఇస్రోకు.. మరో అద్భుత అవకాశం అందివచ్చింది. నాసాతో జత కట్టి, అంతరిక్ష రంగంలో మరిన్ని అప్రతిహత విజయాలను అందుకోనుంది. దీనిలో భాగంగా ఇండియా ఆర్టిమిస్ లో జాయిన్ కానుంది. 2024లో ఇండియా-అమెరికా జాయింట్ గా స్పేస్ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఇవి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తో అనుసంధానం కానున్నాయి.
ట్రేడ్ ఒప్పందాల్లో వివాదాలను… వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ పరిధిలో పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.గ్రీన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, రవాణా, రంగాల్లో కూడా రెండు దేశాలూ సహకరించుకునే అంశంపై కీలక ఒప్పందాలు కుదిరాయి.మొత్తంగా ఇండియాలో కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా కంపెనీలు ముందుకొచ్చాయి.
భారత్ అభివృద్ధిలో దూసుకెళ్లేందుకు ఈ ఒప్పందాలు అత్యంత కీలకమైనవి. పైగా.. సరిహద్దు దేశాలైన చైనా, పాకిస్థాన్ని కట్టడి చెయ్యడానికి కూడా అమెరికాతో సంబంధాలు భారత్‌కు కీలకంగా మారాయి. ఈ క్రమంలో జరిగిన భేటీ.. రెండు దేశాల మధ్యా బంధాన్ని మరింత బలపరిచినట్లైంది.













