అగ్రరాజ్యంలో రేసిజం…
అగ్రరాజ్యమైన అమెరికాలో రేసిజం మరోసారి జడలు విప్పింది. నల్లజాతీయురాలిపై ఓ పోలీసు అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. భర్త అరెస్టును వీడియో తీయడంతో …ఆమె ఫోన్ లాక్కుని నేలపైకి తోసి, మోకాలితో అదిమిపట్టి దాడి చేశాడు. ఆమె కళ్లల్లో పెప్పర్‌స్ప్రే కొట్టాడు. కాలిఫోర్నియాలో జరిగిన ఈదారుణ ఘటన.. ఇప్పుడు అమెరికాలో ప్రకంపనలు రేపుతోంది. ఇది జార్జి ఫాయిడ్ ఘటనను గుర్తుకు తెస్తోందని .. నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
లాస్ఏంజిల్స్ లోని లాంకాస్టర్ ప్రాంతంలో వింకో గ్రాసరీ స్టోర్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ స్టోర్‌లో దొంగతనం చేశారన్న ఆరోపణలతో నల్లజాతి దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, తమను తప్పుడు కేసులో ఇరికించారని ఆ జంట ఆరోపించింది. ఈ క్రమంలోనే భర్త చేతికి పోలీసులు సంకెళ్లు వేస్తుండగా.. ఆ తతంగాన్ని ఆయన భార్య తన ఫోన్లో రికార్డ్ చేసింది.
ఇది చూసిన ఓ పోలీసు అధికారి వెంటనే ఆమె వద్దకు దూసుకెళ్లి ఆమె చేతిలోని ఫోన్‌ను లాగేసుకున్నాడు. ఆమెను లాక్కెళ్లి నేలపైకి తోసేశాడు. ఆమె ఎక్కడికీ వెళ్లకుండా మోకాలితో అదిమిపట్టి దారుణంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత తన వద్దనున్న పెప్పర్ స్ప్రేను ఆమె కళ్లల్లో కొట్టాడు. దీంతో కంటిలో తీవ్రమైన మంటతో ఆమె విలవిల్లాడింది. కళ్లముందే తన భార్యను హింసించడం చూసి ఆవేదనకు గురైన ఆ భర్త.. ‘‘ఆమెను ఏం చేయొద్దు. ఆమె క్యాన్సర్‌తో బాధపడుతోంది అంటూ పోలీసులను ప్రాధేయపడ్డాడు.
ఈ ఘటనను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో .. ఒక్కసారిగా వైరల్ అయింది. దీనిపై లాస్ ఏంజిల్స్ కౌంటీ షెరిఫ్ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని, అందువల్ల దీనిపై ఇప్పుడు ఎలాంటి స్పష్టతనివ్వలేమని తెలిపింది. నిబంధనలను పాటించని సిబ్బందిపై తప్పక చర్యలు తీసుకుంటామంది. ఈ ఘటనలో పారదర్శకంగా ఉండేందుకు సదరు పోలీసు అధికారి బాడీక్యామ్ వీడియోను కూడా విడుదల చేసినట్లు తెలిపింది.కొన్ని కారణాల దృష్ట్యా ఘటనకు పాల్పడిన పోలీసు అధికారుల వివరాలను బయటపెట్టలేదు. అయితే, వారిని ప్రస్తుతానికి ఫీల్డ్ విధుల నుంచి తప్పించి దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
2020లో మినియాపోలిస్ నగరంలో పోలీసుల కర్కశత్వానికి ఆఫ్రో-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మరణించాడు. కస్టడీలో ఉన్న అతడిపై ఓ పోలీసు దాడి చేసి అతడి మెడను మోకాలితో అదిమిపట్టాడు. దీంతో ఊపిరాడక జార్జ్ మృతిచెందాడు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఫ్లాయిడ్ మరణానికి జాతి వివక్షే కారణమని పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి.













