ద్రవిడ రాజకీయం..
తమిళనాడులో అధికార డీఎంకే మళ్లీ …తన పునాదుల బలోపేతంపై ఫోకస్ పెట్టింది. తమ చేజారిన ఓటు బ్యాంకును పదిలం చేసుకోవడంపై కసరత్తు ముమ్మరం చేసింది. ప్రధానంగా వివిధ రాష్ట్రాల్లో వేళ్లూనుకుంటున్న కమలానికి .. తమిళనాడులో ప్రవేశం లేకుండా కంచె వేస్తోంది. ఇటీవల పరిణామాలు చూస్తుంటే, ఇదే అర్థమవుతోంది. ఈమధ్య కాలంలో సీఎం స్టాలిన్… యాంటీ హిందీ పంథా అవలంభిస్తున్నారు. నీట్ పరీక్షపై అయితే ఉద్యమానికి సిద్ధమంటూ గట్టిగా ప్రకటించేశారు కూడా..
ఇక స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ మరో రెండాకులు ఎక్కువే చదివారు. తమపార్టీ మూలాలైన ద్రావిడ అంశాన్ని వీలైనంత ఎక్కువగా తెరపైకి తెస్తున్నారు. తాజాగా సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, కరోనాలతో పోల్చారు. దానిని వ్యతిరేకించడమే కాదు.. సమూలంగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. సనాతన నిర్మూలన సదస్సులో మాట్లాడుతూ.. సనాతన ధర్మం సామాజిక న్యాయం, సమానత్వానికి విరుద్ధమని అన్నారు.
‘కొన్నింటిని వ్యతిరేకించలేం. నిర్మూలించాల్సిందే. డెంగ్యూ, మలేరియా, కరోనాలను వ్యతిరేకించలేం. సనాతన అనేది సంస్కృత పదం. సామాజిక, సమానత్వానికి విరుద్ధం. నిర్మూలించాల్సిందే.’ అని యువజన, క్రీడా అభివృద్ధి మంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. అంతే కాదు తాను అన్న విషయాన్ని ఉదయనిధి గట్టిగా సమర్థించుకున్నారు కూడా. బలహీనవర్గాల పక్షాన తాను మాట్లాడానన్నారు.
‘సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై బీజెపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ విరుచుకుపడ్డారు. సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న 80 శాతం జనాభా మారణహోమానికి ఉదయనిధి స్టాలిన్ పిలుపునిచ్చారని దుయ్యబట్టారు. కాంగ్రెస్కు చాలాకాలంగా మిత్ర పక్షంగా ఉంటోంది డీఎంకే. ముంబయి మీటింగ్లో ఇండియా కూటమి ఇదే నిర్ణయించిందా..?’ అని ప్రశ్నించారు.
బీజేపీ ఆరోపణలకు ఉదయనిధి గట్టిగానే బదులిచ్చారు. తాను మారణహోమానికి పిలుపునివ్వలేదని అన్నారు. సనాతన ధర్మం కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజల పక్షాన మాట్లాడినట్లు తెలిపారు. ‘ఎలాంటి న్యాయపరమైన సవాలునైనా ఎదుర్కొనేందుకు సిద్ధమన్నారు. కాషాయ బెదిరింపులకు మేము భయపడము. పెరియార్, అన్నా, కలైంజ్ఞర్ అనుచరులమైన మేము సామాజిక న్యాయాన్ని నిలబెట్టడానికి, సమానత్వ సమాజాన్ని స్థాపించడానికి ఎప్పటికీ పోరాడుతాము.’ అని ఉదయనిధి స్టాలిన్ పునరుద్ఘాటించారు.













