Panama Canal: మిత్రులతో ట్రంప్ గిల్లికజ్జాలు…
అమెరికా ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చడంపై నూతన అధ్యక్షుడు ట్రంప్(Trump) ఫోకస్ పెట్టారు. ఇప్పటివరకూ జరిగింది ఓ ఎత్తు.. ఇక నుంచి అలా జరగడానికి వీల్లేదంటూ మిత్రదేశాలకు పరోక్ష వార్నింగిలిస్తున్నారు ట్రంప్. కెనడా, మెక్సికో వంతు పూర్తయింది. ఇప్పుడు పొరుగునే ఉన్న పనామా(panama), డెన్మార్క్(Denmark) లపై పడ్డారు ట్రంప్. పనామా కాల్వలో ప్రయాణిస్తున్న పడవలు..వాటికి విధిస్తున్న పన్నును సైతం ట్రంప్ పరిగణనలోకి తీసుకున్నారు. మరోవైపు.. గ్రీన్ ల్యాండ్ కొంటాం అమ్ముతారా అంటూ డెన్మార్క్ ను మరోసారి కెలికేశారు ట్రంప్.
‘ట్రంప్ లాంటి మిత్రుడుంటే.. ఇక కొత్తగా శత్రువులెందుకు..?’ కొన్నేళ్ల క్రితం ఐరోపా సమాఖ్య మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్(tusk) చేసిన వ్యాఖ్య దీనిని నిజం చేసే పనిలో ట్రంప్ నిమగ్నమైనట్లు ఉంది. ప్రమాణస్వీకారం పూర్తికాకుండానే చుట్టుపక్కల దేశాలు.. మిత్రులతో గిల్లికజ్జాలు మొదలుపెట్టారు.
తాజాగా పనామా కెనాల్‌ను ఆక్రమిస్తామంటూ హెచ్చరించడంతో.. .. ఆ దేశాధ్యక్షుడు జోస్ రౌల్ ములినో తీవ్రంగా స్పందించారు. తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకొంటామని ఆయన తేల్చిచెప్పారు. కీలకమైన పనామా కాల్వలో ప్రతి చదరపు మీటరు తమ దేశానికే చెందుతుందని స్పష్టం చేశారు.. ట్రంప్ నేరుగా ప్రస్తావించకుండా ఆయన ఎక్స్‌లో ఈమేరకు వీడియో సందేశాన్ని పోస్టు చేశారు. తాము కాల్వలో ప్రయాణించే నౌకల నుంచి ఖర్చులకు అనుగుణంగా ఫీజులు వసూలుచేస్తామని దీనిని నిపుణుల కమిటీ నిర్ణయిస్తుందని చెప్పారు. సప్లై-డిమాండ్ ఆధారంగా ఇది ఉంటుందన్నారు. అంతేగానీ, అడ్డగోలుగా టారిఫ్‌లు విధించమన్నారు. ‘‘పనామావాసులకు వివిధ అంశాలపై వేర్వేరు దృక్కోణాలు ఉండొచ్చు.. కానీ, అది కెనాల్, సార్వభౌమత్వం విషయానికి వస్తే.. దేశం మొత్తం ఏకం అవుతుంది’’ అని జోస్ పేర్కొన్నారు.
‘‘పనామా కెనాల్ అమెరికాకు కీలకమైన జాతీయ ఆస్తి. దేశ జాతీయ, ఆర్థిక భద్రతకు అత్యంత కీలకం. ఉదారంగా ఇచ్చిన విరాళం విషయంలో నైతిక, చట్టపరమైన సూత్రాలు పాటించకపోతే.. పనామా కాల్వను మాకు తిరిగి ఇచ్చేయాలి. ఈమేరకు అధికారులకు సూచించండి’’ అని పేర్కొనడం సంచలనం సృష్టించింది. తాజాగా పనామా అధ్యక్షుడు జోస్ స్పందనకు ప్రతిస్పందనతో ట్రంప్ మరోసారి కవ్వించారు. ఆయన ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే.. ట్రంప్ తన ట్రూత్ సోషల్ పనామా కాల్వపై మరో పోస్టు చేశారు. పనామా కాల్వలో అమెరికా పతాకం ఉన్నట్లున్న ఫొటోను పెట్టి.. ‘‘యునైటెడ్ స్టేట్స్ కెనాల్‌కు స్వాగతం’’ అని క్యాప్షన్ జత చేయడంతో దీనికి ఆజ్యం పోసినట్లైంది.
నౌకాయాన భారం తగ్గిస్తూ.. అట్లాంటిక్-పసిఫిక్ సముద్రాలను కలుపుతూ అమెరికా భారీ వ్యయప్రయాసలతో పనామా కాల్వను 1914లో నిర్మించింది. దీనిని తొలుత అమెరికానే నిర్వహించింది. కానీ, పనామా దేశంలో దీనిపై తీవ్ర అసంతృప్తితో ఘర్షణలు చెలరేగడంతో.. 1977లో అమెరికా అధ్యక్షుడు జిమ్మి కార్టర్ కీలక నిర్ణయం తీసుకొన్నారు. ఈ కాల్వను ఆదేశానికి అప్పజెబుతూ ఒప్పందం చేసుకొన్నారు. ఈ కాల్వ తటస్థంగా ఉండి తీరాలని అమెరికా షరతు విధించింది. ఇక్కడ ఎటువంటి ముప్పు వచ్చినా అమెరికాకు దానిని రక్షించుకొనే హక్కు ఉంటుందని పేర్కొంది. ఆ తర్వాత పనామా ప్రభుత్వం కూడా ఈ కాల్వ అభివృద్ధికి భారీ మొత్తంలోనే ఖర్చు చేసింది.
మరోవైపు డెన్మార్క్ అధీనంలోని గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేస్తానని ట్రంప్ ఆదివారం మరో బాంబు పేల్చారు. ఆయన 2016లో అధ్యక్షుడిగా ఉన్న వేళ కూడా ఈ ప్రతిపాదన తెర పైకి రాగా.. నాడు డెన్మార్క్ తిరస్కరించింది. తాజాగా ఆ దేశానికి అమెరికా రాయబారిగా కెన్ హౌరీని నియమించిన వేళ.. ట్రంప్ తన మనసులో మాటను బయటపెట్టారు. ‘‘జాతీయ భద్రత, ప్రపంచంలో స్వేచ్ఛను కాపాడటానికి గ్రీన్‌ల్యాండ్‌పై యాజమాన్యం ఉండటం చాలా కీలకమని అమెరికా భావిస్తోంది’’ అని ట్రూత్‌లో పోస్టు చేశారు. అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా కెన్ అద్భుతంగా పనిచేయనున్నారన్నారు.
ఖనిజాలు నిక్షిప్తమైన ప్రాంతంగా గ్రీన్‌ల్యాండ్‌కు పేరుంది. ప్రపంచంలోని 13శాతం చమురు.. 30 శాతం గుర్తించని గ్యాస్ నిల్వలున్నట్లు భావిస్తున్న ఆర్కిటిక్‌లో ఇది భాగం. అతితక్కువ జనావాసం ఉన్న ఈ ప్రాంతంలో ట్రంప్ రియల్ ఎస్టేట్ వెంచర్లు చేపట్టాలని భావించినట్లు కూడా చెబుతుంటారు. 21 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ ప్రాంతంలో కేవలం 56,500 మంది మాత్రమే జీవిస్తున్నారు. 75శాతం భూభాగం ఎప్పుడూ మంచు కిందే ఉంటుంది.
వాణిజ్య లోటు భర్తీ కోసం పొరుగుదేశాలపై భారీగా టారీఫ్‌లు విధిస్తామంటూ ప్రకటించిన ట్రంప్.. ఒక దశలో కెనడా, మెక్సికోను తమ దేశంలో రాష్ట్రాలుగా చేరాలని ఎద్దేవా చేశారు. ఇక జస్టిన్ ట్రూడో విషయంలో మరో అడుగు ముందుకువేసి అమెరికా 51వ రాష్ట్రం కెనడా గవర్నర్ ట్రూడో అంటూ సంబోధిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కెనడాకు 100 బిలియన్ డాలర్లు, మెక్సికోకు 300 బిలియన్ డాలర్లు రాయితీలు ఇస్తున్నామని ఆరోపించారు.






