స్నేహం స్నేహమే.. వ్యాపారం వ్యాపారమే అంటున్న ట్రంప్…
అమెరికా రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్.. పక్కా కమర్షియల్. తన వ్యాపారమైనా, దేశం బిజినెస్ అయినా ఆయన అలానే ప్రవర్తిస్తారు. పూర్తి ముక్కుసూటితనాన్ని ప్రదర్శిస్తారు. ఇప్పుడదే అమెరికా మిత్రదేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో నాటోకూటమికి సంబంధించి సభ్యదేశాలు తగినంతపెట్టుబడి పెట్టకుంటే… ఉచితంగా రక్షణ ఇవ్వడం సాధ్యం కాదని తేల్చిచెప్పడం ద్వారా కలకలం రేపారు ట్రంప్. ఇప్పుడదే విధానానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు.
తమ నుంచి ఏ దేశానికి ఫ్రీగా రక్షణ లభించబోదనే సంకేతాలను అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఇస్తున్నారు. తైవాన్‌కు విదేశీ ఆక్రమణల నుంచి రక్షణ కల్పించాలంటే కచ్చితంగా వాషింగ్టన్కు డబ్బులు చెల్లించాల్సిందేనని ఆయన తేల్చిచెప్పారు. ఆయన బ్లూమ్‌బెర్గ్ బిజినెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికా నుంచి లభించే రక్షణను ఆయన బీమా పాలసీతో పోల్చారు. ఈసందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ తైవాన్ రక్షణలో ఉన్న వాస్తవిక ఇబ్బందులను ప్రస్తావించారు. తమ దేశం నుంచి ఆ ద్వీపం 9,500 మైళ్లు ఉండగా.. అది చైనాకు కేవలం 68 మైళ్ల దూరంలోనే ఉందని గుర్తు చేశారు.
అమెరికా నుంచి చిప్ వ్యాపారాన్ని తైవాన్ లాక్కొని అత్యంత సంపన్న దేశంగా మారిందని పేర్కొన్నారు. అదే సమయంలో అమెరికా నుంచి ఉచితంగా తైవాన్‌కు రక్షణ కల్పించడాన్ని కూడా ప్రశ్నించారు. అసలెందుకు ఇదంతా చేస్తున్నారన్నారు. ట్రంప్ అధికారంలోకి వస్తే తైవాన్ విషయంలో అమెరికా సంప్రదాయంగా పాటిస్తున్న పాలసీలో సంపూర్ణ మార్పులు ఉంటాయని సంకేతాలనిచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలపై తైవాన్ ప్రీమియర్ చావ్ జంగ్ తాయ్ స్పందించారు. సాధారణ సంబంధాలు లేకపోయినా.. అమెరికాతో మంచి మిత్రత్వం ఉందన్నారు. తమ ప్రభుత్వం తైవాన్ రక్షణను బలోపేతం చేస్తుందని చెప్పారు.
మరింత బాధ్యత తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలు తైవాన్‌కు చెందిన చిప్స్ తయారీ దిగ్గజం టీఎస్ఎంసీ షేర్లపై ప్రభావం చూపింది. నేడు ఆ కంపెనీ షేర్లు 1.1శాతం పతనమయ్యాయి. ప్రస్తుతం అమెరికా అధ్యక్ష రేసులో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ ముందున్నారు. ఈనేపథ్యంలో ఆయన అధికారంలోకి వస్తే అమెరికా డబ్బుతో మిత్ర దేశాలకు రక్షణ అంత తేలిక కాబోదనే సంతకేతాలు వెళ్లాయి.






