అగ్రరాజ్యంలో ట్రంప్ టెన్షన్
200 ఏళ్లకు పైగా ప్రజాస్వామ్య చరిత్ర ఉన్న దేశం అమెరికా. ఎన్నోదేశాలకు మార్గదర్శకంగా నిలబడిన స్వేచ్ఛాయుత దేశమది. అలాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన అమెరికా.. ఇప్పుడు సంక్షోభం అంచున నిలిచింది. చిన్న తప్పు చేస్తే అమెరికన్ అధ్యక్షుడి కుమార్తె సైతం .. అరెస్టైన పరిస్థితిని అక్కడ గతంలో చూాశాం. సాక్షాత్తూ జార్జిబుష్ కుమార్తె జెమీమా.. మైనర్ డ్రింకింగ్ ఇష్యూలో అరెస్టయ్యారు. అధికార పీఠంలో కూర్చున్నప్పటికీ.. వారు ఈప్రక్రియలో స్వార్థపరత్వంతో వ్యవహరించలేదు. దీంతో అమెరికాలో ప్రజాస్వామ్యం ఎంత పక్కాగా అమలవుతుందో ప్రపంచానికి చాటిచెప్పారు. మరి ఇప్పుడు అధికార దాహంతో రగిలిపోతున్న మాజీ అధ్యక్షుడు ట్రంప్.. అమెరికన్లకు ఆందోళనకరంగా తయ్యారయ్యారు.
దశాబ్దాల అమెరికా ప్రజాస్వామ్యవ్యవస్థకి చెదలు పట్టించిన ఒకే ఒక్కడు డొనాల్డ్ ట్రంప్. అతను ప్రజాస్వామ్య వ్యవస్థలో నియంతృత్వపోకడలున్న వ్యక్తి. ఓటమిని అంగీకరించకుండా తానే ఎప్పటికీ సర్వంసహాచక్రవర్తినని భావిస్తున్న నేత.. తాను ఓడిపోయానన్న అక్కసుతో అమెరికన్ ప్రెసిడెన్షియల్ బిల్డింగ్ మీద దాడి చేయించిన తీవ్రవాది. ఇంత జరిగినా ఇప్పటికీ తాను 2024 ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తానని నమ్ముతున్న అతివాది. నాలుగు నెలల్లో మూడుసార్లు కోర్టుకు హాజరైన మాజీ అధ్యక్షుడు ట్రంప్.
ఒకటికాదు రెండు కాదు పదుల సంఖ్యలో కేసులను ఎదుర్కొంటున్నారు ట్రంప్. మరీ ముఖ్యంగా క్రిమినల్ కేసు నమోదైన తొలి అమెరికా మాజీ రాష్ట్రపతి ట్రంప్. ఇన్నింటిలోనూ ప్రమేయమున్నప్పటికీ ట్రంప్ లో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడంలేదు. అంతే కాదు ఇవన్నీ తనను అణగదొక్కడానికి జరుగుతున్న ప్రయత్నాలని బుకాయిస్తున్నారు ట్రంప్. తనపై కేసుల నుంచి బయటకు వస్తానని చెబుతున్నారు. అయితే ఇందులో ఓవార్నింగ్ కూడా ఉండడం.. అమెరికన్లను కలవరపెడుతోంది. తాను అధికారంలోకి వస్తే కేసు మూసేస్తానని.. ఈ విచారణలో భాగస్వాములైన అన్ని న్యాయ సంబంధ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలను శిక్షిస్తానన్నారు.
అసలు అంత పెద్ద ప్రజాస్వామ్యవ్యతిరేక చర్య చేసాక జైలుకెళ్తానన్న భయం లేకుండా.. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కొడుకు మీద నేరారోపణలు చేస్తూ, బైడెన్ కుటుంబమే నేరస్థుల కుటుంబమని ప్రజల్ని నమ్మించాలని చూస్తున్న వ్యక్తి ట్రంప్. నమ్మించడమంటే కేవలం మాటలతో కాదు. దీని మీద లాయర్లను పెట్టుకుని కోర్టులో కేసులు నడుపుతున్నాడు. తనపై కేసుల నుంచి బయటపడడానికి, తాను బైడెన్ పై పెట్టిన కేసులను ముందుకు తీసుకువెళ్లడానికి ట్రంప్ తన లాయర్లపై పెడుతున్న ఖర్చు కొండంత.
ట్రంప్ ని న్యాయబద్ధంగా విచారించాక అతడు అపరాధి అని కోర్టు సమక్షంలో తేలితే జైలుకు పంపే ధైర్యం ఆ దేశం చేయలుగుతుందా? అలా చేస్తే రిపబ్లికన్ అతివాదులు రెచ్చిపోయి మరింత విధ్వంసం సృష్టిస్తే దేశంలో ఏ ఆఫ్ఘనిస్తాన్ లాంటి వాతావరణమో రాకుండా నివారించగలరా! అదే జరిగితే అంతర్జాతీయంగా అమెరికా ఇమేజ్ ఏమౌతుంది? స్టాక్ మార్కెట్లు ఏమౌతాయి? అమెరికన్ డాలర్ మీద ఆధారపడిన అంతర్జాతీయ విపణి ఏమౌతుంది?
డొనాల్డ్ ట్రంప్ గొడవని కేవలం అమెరికాకి సంబంధించిన గొడవగా చూడకూడదు. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యాలన్నింటికీ గుణపాఠం. అటువంటి నాయకులు ఆయా దేశాల్లో పుట్టుకొస్తే ఎలా నిలువరించాలో ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ తరహా నాయకులు తమ వర్గం ప్రజల్ని రెచ్చగొట్టగలరు, అంతర్యుద్ధాలకి కూడా తెరలేపగలరు.






