ట్రంప్ తో టెన్షనే..
నవంబర్ లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్, బైడెన్ పోటీ పడుతున్నారు. ద గ్రాండ్ ఓల్డ్ పార్టీ రిపబ్లికన్ల తరపున ట్రంప్ గట్టి అభ్యర్థిగా ఉన్నారు. ఇక అధికార డెమొక్రాటిక్ పార్టీ తరపున బైడెన్ పోటీలో నిలిచారు. ప్రస్తుతం పరిస్థితులను బట్టిచూస్తే, ట్రంప్ గెలిచే అవకాశాలున్నట్లు అంచనాలున్నాయి. అయితే ట్రంప్ గెలుపు అంతసులభం కాబోదు.. ఎందుకంటే ఆయనపై ఉన్న కేసుల తీవ్రత అలాంటిది. మరి వీటన్నింటినీ దాటుకుంటూ అధ్యక్ష పదవిని ట్రంప్ చేపడితే.. ఆయన మరోసారి తనదైన పాలన చూపిస్తారని చెప్పడంలో ఎలాంటి అసంబద్ధం లేదు.
ట్రంప్ తో వచ్చిన చిక్కేంటంటే తనను తాను సుప్రీం అనుకుంటారు. తాను అనుకున్నదే జరగాలని గట్టిగా కోరుకుంటారు. దానికి ఎవరైనా అడ్డువస్తే అస్సలు అంగీకరించరు. అంతేకాదు.. అత్యంత కటువైన పదజాలంతో విరుచుకుపడతారు. అక్కడితో ఆగితే పర్వాలేదు. ఆపై పరిణామాలకు సైతం ట్రంప్ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత తలెత్తిన క్యాపిటల్ హింసాత్మక ఘటనలే దీనికి ఉదాహరణ. అయితే దీన్ని సైతం ఆయన ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా సమర్థించుకోగల నేర్పరి.
ఓవైపు వరుస కేసులు .. ట్రంప్ సహనానికి పరీక్ష పెడుతున్నాయి. అందులో ముఖ్యమైంది శృంగారతార స్టార్మీ డానియల్స్ కు చెల్లింపుల కోసం రికార్డుల తారుమారు అంశం. దీనిపై కోర్టులో ఎదురుదెబ్బ సైతం తగిలింది.అయినా ట్రంప్.. తగ్గేదే లేదంటున్నారు. జులై నెలలో ఈ కేసులో శిక్ష పడే అవకాశం ఉంది. అయితే తనకు జైలు శిక్ష విధించడాన్ని తన మద్దతుదారులు జీర్ణించుకోలేకపోవచ్చంటూ నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. తనకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఇది చాలదా.. అమెరికాకు ఇబ్బందులు తలెత్తడానికి.
అసలే ట్రంప్ కు ఉన్న అభిమానులు మామూలోళ్లు కాదు. ట్రంప్ చెప్పారో లేదో కానీ గత ఎన్నికల్లో హింసాత్మక ఘటనలకు తెగబడ్డారు. ప్రస్తుతం వారిలో చాలా మంది జైల్లో ఉన్నారు కూడా. మరి ట్రంప్ నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తే.. ఆ పరిణామాలు అమెరికాను మరిన్ని చిక్కుల్లోకి నెట్టే అవకాశంఉంది. కచ్చితంగా చెప్పాలంటే అమెరికా లాంటి అగ్రదేశంలో అంతర్గత సంక్షోభం తలెత్తనూ వచ్చు.అయితే అమెరికాకు ఉన్న సమర్థ యంత్రాంగం దీన్ని నిలువరించవచ్చు.కానీ.. ఆదేశానికి అంతర్జాతీయంగా ఉన్న ప్రాభవం మాత్రం కొడిగట్టే సూచనలున్నాయి. ఈ పరిణామం అమెరికానుఅమితంగా అభిమానించే వారికి కాస్త బాధ కలిగించవచ్చు.






