బెంగాల్ రాజకీయం…టీఎంసీ- బీజేపీ హోరాహోరీ
ఒకరికి అధికారం నిలబెట్టుకోవాలన్న పట్టుదల… మరొకరికి.. అధికారం జేచిక్కించుకోవాలన్న మొండి పట్టుదల.. వెరసి… బెంగాల్ రాజకీయం కాస్త దంగల్ గా మారిపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్ నుంచి బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్నప్పటి నుంచి బెంగాల్ రాజకీయ చదరంగం ఒక్కసారిగా మారిపోయింది. రాజకీయ చదరంగంలో బీజేపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వచ్చే ఎన్నికల్లోనూ తనదే గెలుపు కావాలని ‘దీదీ’ శతధా ప్రయత్నిస్తోంది. వీలు చిక్కినప్పుడల్లా బీజేపీపై విరుచుకుపడుతూనే ఉంది. ఇక.. బీజేపీ కూడా అంతే. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ తృణమూల్ ను ఏకి పారేయాలని నిర్ణయించుకుంది. ఈ ఇద్దరి పంతాలతో బెంగాల్ రాజకీయమే మారిపోయింది. కొన్ని సంవత్సరాల పాటు బెంగాల్‌ను ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన వామపక్షాలు అడ్రస్ లేకుండా పోయాయి. బెంగాల్ చదరంగం వామపక్షాలు లేని చదరంగంగా మారిపోయింది. ఇటు తృణమూల్‌లో గాని, అటు బీజేపీలో గాని యువ నాయకత్వమంటూ ఎవరూ లేరు. అటు వామపక్షాల్లోనూ లేరు. కానీ… రాజకీయ పరుగులో మాత్రం వామపక్షాలు వెనక్కి పడిపోయాయి. కొన్ని రోజుల క్రితం వరకూ బీజేపీ పునాదులు కూడా బలంగా ఏమీ లేవు. ఎప్పుడైతే మోదీ,షా ద్వయం ప్రవేశించిందో.. బెంగాల్‌ను ఓ ఉడుంపట్టు పడుతున్నారు.
ముఖ్యంగా అమిత్‌షా… అన్నీ తానై రాజకీయ చదంగంలో పావులు కదుపుతున్నారు. నెలకు రెండు రోజులు కచ్చితంగా బెంగాల్లో పర్యటిస్తున్నారు. కేవలం పర్యటన మాత్రమే కాదు… ఎప్పటికప్పుడు సంస్థాగతంగా పార్టీ పునాదులను బలీయంగా మార్చేస్తున్నారు.
‘ఆకర్షణీయ నేత’లేకపోయినా బీజేపీ పునాదులను పటిష్ఠం చేస్తున్న షా
బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కీలక నేతలను ఇన్‌చార్జీలుగా నియమించింది. ఇప్పటి వరకూ సంస్థాగత వ్యవహారాలను జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస విజయ వర్గీయ చూస్తున్నారు. ఆయన ఆరెస్సెస్ నేత. దీంతో సులువుగా సంస్థాగత పునాదులను పటిష్ఠం చేస్తున్నారు. ఈ క్రమంలో అధికార తృణమూల్ నుంచి గానీ, అటు వామపక్షాల నుంచి ప్రతిఘటన ఎదురైనా… తట్టుకొని నిలబడ్డారు. పార్టీ పునాదులను పటిష్ఠం చేస్తున్నారు. ఇక.. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో యువనేత, బెంగళూరు ఎంపీ, యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్యను కూడా అమిత్‌షా రంగంలోకి దింపారు.
యువకులను ఆకర్షించడానికి తేజస్వీ సూర్యను బీజేపీ తెరపైకి తెచ్చింది. తృణమూల్ లో మమతా బెనర్జీ అల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ ఉన్నా… ఆయనపై పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎవరితోనూ సఖ్యతగా మసులుకోరన్న అపప్రథను మూటగట్టుకున్నారు. పైగా అవినీతి ఆరోపణలు. దీంతో యువకులను ఆకర్షించడంలో తృణమూల్ కాస్త వెనుకబడిందనే చెప్పుకోవాలి. మరోవైపు బెంగాల్లో ‘సంఘ్’ కూడా పటిష్ఠమైంది. గతంలో కంటే ‘శాఖ’లు కూడా పెరిగినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే బీజేపీ కూడా పటిష్ఠమవుతూ వస్తోంది. సంస్థాగతంగా ఆకర్షణీయమైన, రాజకీయ చదరంగాన్ని బలంగా ఆడే నేతలు లేకపోవడంతో షా కొత్త వ్యూహానికి తెరలేపారు. ఇతర పార్టీల నుంచి బలంగా ఉన్న నేతలను బీజేపీలోకి ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా అధికార తృణమూల్‌ను టార్గెట్ గా చేసుకొనే షా పావులు కదుపుతున్నారు. ఈ వ్యూహం ముకుల్ రాయ్ నుంచి ప్రారంభమై…. తాజాగా రాజీవ్ బెనర్జీ వరకూ కొనసాగుతోంది.
ముకుల్ రాయ్ సంస్థాగతంగా బలమైన నేత. ఇంతకు పూర్వం తృణమూల్ లో ఉండేవారు. తృణమూల్ సంస్థాగత సభ్యుడు కూడా. శారదా స్కామ్ తెరపైకి వచ్చిన సందర్భంలో ఆయన హఠాత్తుగా బీజేపీకి మారారు. అప్పటి నుంచి బీజేపీని విస్తరించే పనిలో సైలెంట్ గా వ్యూహాలు వేస్తున్నారు. ఇక… సుబేందు అధికారి. బలమైన నేపథ్యమున్న నేత. సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడు. నందిగ్రామ్ లో సెజ్‌లకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమం నడిపిన నేత. సెజ్‌లకు వ్యతిరేకంగా సీపీఎంను ఏకిపారేయడంలో సుబేందుదే కీలక పాత్ర. కొన్ని సంవత్సరాల పాటు పాతుకుపోయిన వామపక్షాలను కూకటి వేళ్లతో పెకిలించి, సీఎం మమతను సీఎం కుర్చీపై కూర్చోబెట్టిన సర్వ సమర్థుడు. దాదాపు 50 నియోజకవర్గాలపై అశేష పట్టు సాధించిన అసమాన నేత. అంతటి నేతను బీజేపీ లాగేసుకుంది. దీంతో మమత తీవ్రమైన షాక్‌లో పడిపోయారు. వచ్చే ఎన్నికల్లో తాను నందిగ్రామ్ నుంబే బరిలోకి దిగుతునానని మమత ఆవేశంతో ప్రకటించారంటే వ్యవహారం ఎంత వరకు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. అంతే ఆవేశంతో సుబేందు కూడా సవాల్ విసిరారు. 50 వేల ఓట్లతో మమతను ఓడించి తీరుతానని శపథం చేశారు. ఆ తర్వాత రాజీవ్ బెనర్జీ. ఈయన మమత కేబినెట్లో అటవీ శాఖమంత్రి. హఠాత్తుగా మంత్రి పదవికి రాజీనామా చేశారు. కొన్ని రోజుల తర్వాత ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసేశారు. బీజేపీలో చేరిపోడానికి సిద్ధపడిపోయారు. వీరితో పాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. వారందరూ షా సమక్షంలోనే హౌరా సభలో బీజేపీలో చేరాల్సి ఉంది. అయితే హఠాత్తుగా షా బెంగాల్ పర్యటన రద్దైంది. దీంతో వారికి ఓ స్పెషల్ ఫ్లైట్ పంపించి, వారిని ఢిల్లీకి రప్పించారు షా. ఇలా… ఇతర పార్టీల్లో బలమైన నేతలను బీజేపీలోకి ఆహ్వానించి… బీజేపీని అధికార పీఠానికి దగ్గర చేయాలని షా వ్యూహాలు వేస్తున్నారు.
మమత ‘ఇగో’తో రాజకీయం చేస్తున్న బీజేపీ
మమత బెనర్జీ…. రాజకీయంగా బెంగాల్ లో పాతుకుపోయిన నేత. వామపక్షాలను రాజకీయంగా దెబ్బతీయడానికి వామపక్షాలను వ్యూహం ప్రకారం ‘డీకోడ్’ చేసిన ఘనురాలు. వామపక్షాలంటేనే సింప్లిసిటీకి మారుపేరు. ఆ సింప్లీసిటీతోనే వాటి పునాదులను పెకిలించేశారు మమత. ఓ తెల్లని, ముడతైన చీర, మారుతి జెన్ కారు, స్లిప్పర్ చెప్పులు. ఇలా అతి సాధారణంగా కనిపిస్తూ… ప్రజలకు దగ్గరయ్యారు. ఆ తర్వాత అధికారాన్ని జేచిక్కించుకున్నారు.
అప్పటి నుంచి వరుసగా రెండు పర్యాయాలు ఘన విజయం సాధించారు. అయితే మమత చాలా దూకుడుగా ఉంటారు. అంతేకాకుండా కాస్త ‘ఇగో’కూడా ఉంటుందని, అప్పుడప్పుడు విసుక్కునే గుణం కూడా ఉంటుందని ఆ పార్టీ నేతలే అంటుంటారు. ఈ లక్షణాలతో బీజేపీ ఇప్పుడు రాజకీయం చేస్తోంది.
మమత ఎవ్వర్నీ ఎదగనివ్వరని, ఆమెకు ఇగో ఎక్కువ అని బీజేపీ తీవ్రంగా ప్రచారం చేస్తోంది. దీంతో తృణమూల్ నేతలే ఆత్మరక్షణలో పడిపోయేలా బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోంది. అంతేకాకుండా మమత ఫక్తు ‘లౌకికవాదాన్ని’మోస్తుంటారు. ఈ విషయాన్నే టార్గెట్ గా చేస్తూ.. నేతాజీ జయంత్యుత్సవాల సందర్భంగా కొందరు యువకులు ఆమె ప్రసంగించే సమయంలో ‘జైశ్రీరాం’ అన్న నినాదాలు చేశారు. దీంతో మమతకు చిర్రెత్తుకొచ్చి, ‘నేనేమీ ప్రసంగించను. కూర్చుండిపోతాను.’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే వేదికపై ప్రధాని మోదీ కూడా ఉన్నారు. మౌనం దాల్చారు. ఈ ఎపిసోడ్‌ను బీజేపీ వ్యూహం ప్రకారమే చేసిందని ఓ మాట. జైశ్రీరాం అంటే మమతకు గిట్టదని, ఆమె హిందువులకు వ్యతిరేకమని బీజేపీ తీవ్రంగా ప్రచారం చేస్తోంది.
నిజానికి… జైశ్రీరాం నినాదాల ఆగిన తర్వాత మమత ప్రసంగించి ఉంటే.. ఆ రాజకీయం వేరుండేది. కానీ మమత ఆ పని చేయలేదు. మమత తొందరగా చికాకు పడతారన్న బీజేపీ ప్రచారానికి ఇది బలం చేకూర్చింది. హిందువులకు వ్యతిరేకమన్న ప్రచారానికీ మరింత ఊపు వచ్చినట్టైంది.
‘నేతాజీ’తో ఇరు పార్టీల రాజకీయం
నేతాజీ సుభాస్ చంద్రబోస్…. ఇప్పుడు బెంగాల్ లో ప్రముఖుడై కూర్చున్నారు. ఆయన జయంత్యుత్సవాలు కూడా సరిగ్గా రాజకీయాలు వేడెక్కిన సమయంలోనే వచ్చాయి. దీంతో అటు బీజేపీ, ఇటు తృణమూల్ నేతాజీని టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వమేమో ‘పరాక్రమ దివస్’ పేరుతో జయంత్యుత్సవాలు నిర్వహిస్తుంటే… అధికార తృణమూల్ మాత్రం ‘దేశ్ నాయక్ దివస్’ పేరుతో నిర్వహించాలని తలపెట్టింది. 125 జయంత్యుత్సవాల సందర్భంగా మోదీ బెంగాల్ లో పర్యటించారు. ఈ సందర్భంగానే బీజేపీ వర్సెస్ తృణమూల్‌గా మారిపోయింది. మమత ప్రసంగించే సమయంలోనే కొందరు జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. దీంతో మమత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనగా తానేమీ మాట్లాడనంటూ కూర్చుండిపోయారు. దీన్ని బీజేపీ విపరీతంగా ప్రచారం చేస్తోంది. మరోవైపు ప్రధాని మోదీ, సీఎం మమతకు వ్యక్తిగతంగా చాలా సత్సంబంధాలే ఉన్నాయి.
రాజకీయంగా ప్రత్యర్థులైనా… వ్యక్తిగతంగా వారిద్దరి మధ్య సత్సంబంధాలున్నాయి. తాజాగా మోదీ పర్యటనలో మాత్రం సీన్ ఇలా కనిపించలేదు. కార్యక్రమంలో ఒకరినొకరు ఆప్యాయతతో పలకరించుకున్న సందర్భమేమీ కనిపించలేదు. అంతే.. బెంగాల్ రాజకీయం ఎంతలా వేడెక్కిందో అర్థం చేసుకోవచ్చు. ‘పరాక్రమ్ దివస్’ అని బీజేపీ పేరుపెట్టి.. యువకులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. నేతాజీ సాహస గాథను ప్రధాని మోదీ కూడా ఉటంకించారు. దీంతో యువకులు తమ వైపు వచ్చేలా బీజపీ వ్యూహం వేస్తోంది.
మమత వేసే పాచికలు ఇకపై ఎలా ఉంటాయన్నదే ప్రశ్న..
రాజకీయం.. ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మారే వేదిక. ఎప్పటికప్పుడు ప్రత్యర్థి వేస్తున్న వ్యూహాలను తుత్తునీయలు చేస్తూ ముందుకు సాగాలి. బీజేపీ రాజకీయంగా మమతను అష్టదిగ్బంధనం చేసిందనే చెప్పాలి. ప్రధాని, కేంద్రహోంమంత్రి షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు మరో డజను మంది కేంద్ర మంత్రులు బెంగాల్ పై కన్నేశారు. ఎప్పటికప్పుడు సంస్థాగతంగా పటిష్ఠం చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర పథకాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మరోవైపు మమత కేంద్ర పథకాలు బెంగాల్లోకి రాకుండా వ్యూహం పన్నారు. ఈ వ్యూహాన్నే ఛేదించే పనిలో బీజేపీ నిమగ్నమైంది. కేంద్ర మంత్రులు తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో పర్యటిస్తూ… పథకాలను విపరీతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దీని ద్వారా తమ ఓటు బ్యాంకును పెంచుకోవాలని నిర్ణయించారు. మరోవైపు బీజేపీ ‘హిందుత్వ, దేశభక్తి’ని విపరీతంగా ప్రచారం చేస్తోంది. దీనిని తట్టుకొని సీఎం మమత ఎంత మేరకు నిలబడతారన్నది చూడాల్సిందే. ఇక.. సీఎం మమత కూడా అంతే రీతిలో ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నేతలు ‘అవతలి వ్యక్తులు (అవుటర్స్) అంటూ విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. బెంగాల్ అంటే బీజేపీకి ప్రేమ లేదని, బెంగాల్ సంస్కృతి, బెంగాల్ సమరయోధులంటే వారికి లెక్కలేదని తీవ్రంగా విమర్శిస్తున్నారు. బీజేపీ ఓ వాషింగ్ మెషిన్’ అని, అందులోకి వెళ్లినవారందరూ స్వచ్ఛమవుతారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. బీజేపీలో చేరిపోయిన వారిని మమత ఇలా ఎద్దేవా చేస్తున్నారు. మొత్తానికి బెంగాల్ రాజకీయం తుది అంకానికి చేరుకుంది. మమతను ‘అష్టదిగ్బంధం’ చేసి అధికారాన్ని జేచిక్కించుకోవాలని బీజేపీ గట్టి వ్యూహాన్నే పన్నింది. విచిత్రమేమంటే బెంగాల్ ను కొన్ని సంవత్సరాల పాటు ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన వామపక్షాలు రాజకీయ చదరంగంలో కనిపించకపోవడం. మరోక చిత్రం… సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్ కూడా కనుమరుగు కావడం.













