కరోనా కట్టడికి కేంద్రం బహుముఖ వ్యూహం!
దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఫస్ట్ ఫేజ్ ను లాక్ డౌన్ తో సమర్థంగా కట్టడి చేయగలినా.. సెకండ్ వేవ్ కు లాక్ డౌన్ పరిష్కారం కాదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అంతుచిక్కని విధంగా ఈ వ్యాధి విస్తరిస్తోంది. అందుకే మినీ కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేసి టెస్టింగ్, ట్రాకింగ్ ద్వారా మాత్రమే దీన్ని కట్టడి చేయాలనుకుంటోంది. మరోవైపు వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేసింది. వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలనుకుంటోంది.
కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టిస్తోంది. రోజుకు లక్షన్నరకు పైగా కేసులు నమోదవుతున్నాయి. వచ్చే రెండు, మూడు వారాల్లో ఈ సంఖ్య రెండు, మూడింతలు అవుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు మరణాలు కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అందుకే పరీక్షల సంఖ్యను భారీగా పెంచాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. అందులోనూ 70శాతం ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ర్యాపిడ్ టెస్టుల్లో ఫలితం కరెక్ట్ గా రాకపోవడమే ఇందుకు కారణం. పరీక్షలు వేగవంతం చేయడం ద్వారా కేసుల సంఖ్య వీలైనంత త్వరగా బయటికొస్తుంది. అలాగే వ్యాధి ఎవరికి సోకిందో తెలిస్తో వారి ద్వారా మిగిలిన వారిని ట్రాక్ చేయడానికి వీలవుతుంది. ఒకవేళ ఒకే ఏరియాలో కేసుల సంఖ్య అధికంగా ఉంటే దాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించాలని ప్రభుత్వం ఆదేశించింది.
మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. అయితే తమకు సరిపడా వ్యాక్సిన్లు సరఫరా చేయట్లేదని పలు రాష్ట్రాలు కేంద్రానికి ఫిర్యాదు చేశాయి. వ్యాక్సిన్లు అందిస్తే సరఫరా చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ టీకాలు వేయించుకున్నవారి సంఖ్య 10 కోట్లు దాటింది. జనవరి 15 నుంచి మన దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. 130 కోట్ల భారతీయులందరికీ వ్యాక్సినేషన్ అందించడం అంటే అసాధ్యం. అందుకే ప్రభుత్వం ముందుగా 45 ఏళ్లు పైబడినవారందరికీ వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది. అయితే వారికి కూడా పూర్తిస్థాయిలో సప్లై చేయలేకపోతోంది. దీంతో పలుచోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను వీలైనంత త్వరగా అధిగమించాలని నిర్ణయించింది.
ఇప్పటివరకూ దేశంలో రెండు టీకాలకు అనుమతి ఉండేది. సీరం ఇనిస్టిట్యూట్ కు చెందిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ కు చెందిన కోవాగ్జిన్ టీకాలు ఇప్పటివరకూ అందుబాటులో ఉన్నాయి. తాజాగా రష్యా వ్యాక్సిన్ స్ఫుత్నిక్ వి కూడా అత్యవసర అనుమతులు మంజూరు చేసింది. దీన్ని రెడ్డీస్ ల్యాబ్స్ తయారు చేయనుంది. ఈ నెలాఖరు నుంచి ఇది మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇవి కాకుండా అమెరికా, జపాన్, బ్రిటన్ లలో కూడా ఆయా దేశాలు పలు వ్యాక్సిన్ లకు అనుమతి ఇచ్చాయి. ఆ టీకాలను ఆయా దేశ ప్రజలు ఇప్పటికే వేసుకుంటున్నారు. దీంతో ఆ టీకాలకు కూడా అత్యవసర అనుమతి చేయడం ద్వారా దేశ ప్రజలకు టీకాల కొరత లేకుండా చేయాలనుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. వీటికి వీలైనంత త్వరలోనే పర్మిషన్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇవి కూడా అనుమతులు పొందితే దేశంలో టీకాల కొరత ఉండకపోవచ్చు.













