తెలుగు రాష్ట్రాలకు మరో అన్యాయం చేస్తున్న కేంద్రం..!
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం మరోసారి అన్యాయం చేస్తోంది. ఇప్పటికే పొరుగు రాష్ట్రాలతో తెలుగు రాష్ట్రాలకు జలవివాదాలున్నాయి. అంతర్గత సమస్యలే పరిష్కరించుకోలేక తెలుగు రాష్ట్రాలు సతమతమవుతున్నాయి. ఇప్పుడు పొరుగు రాష్ట్రం కర్నాటక మరో జలవివాదానికి తెరలేపుతోంది. ఇందుకు కేంద్రం అండదండలు పుష్కలంగా ఉండడం మరింత వివాదానికి ఆజ్యం పోస్తోంది. దీంతో తెలుగురాష్ట్రాలు ఉమ్మడిగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది.
ఆలమట్టి, తుంగభద్రలపై కర్నాటక నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా దిగువ రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ తీవ్రంగా నష్టపోతున్నాయి. కర్నాటక చేపడుతున్న అనేక ప్రాజెక్టులపై తెలుగు రాష్ట్రాలు అభ్యంతరం చెప్తున్నాయి. అయితే కర్నాటక తెలుగు రాష్ట్రాల అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోవట్లేదు. తాజాగా కర్నాట అప్పర్ భద్ర ప్రాజెక్టును ప్రతిపాదించింది. అంతేకాక.. దానికి జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. కర్నాటక రాష్ట్ర నీటి కేటాయింపుకు మించి నీటి వాడకాన్ని ప్రతిపాదిస్తూ కర్నాటక చేసిన ప్రాజెక్టుకు కేంద్ర జలశక్తి శాఖ ఆమోదం కూడా తెలిపింది. అంతేకాదు.. దీనికి జాతీయ హోదా ఇచ్చేందుకు సిద్ధమైంది.
కర్నాటక ప్రతిపాదించిన అప్పర భద్ర ప్రాజెక్టును దిగువన ఉన్న ఏపీ, తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కృష్ణా జలాల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ 2 అవార్డు నోటిఫై కాకముందే, దిగువ రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకోకుండా అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం అనుమతులు ఇచ్చేసింది. ఏకంగా జాతీయ హోదాకు కూడా సిఫారసు చేయడం తెలుగు రాష్ట్రాల నీటి కేటాయింపులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రధాని నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ తుది ఆమోదం పొందితే చాలు… అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కుతుంది. ఈ లాంఛనం పూర్తైతే ప్రాజెక్టు ఖర్చు మొత్తం కేంద్రమే భరిస్తుంది.
గతంలో తెలంగాణ చేపట్టిన బృహత్ ప్రాజెక్టు కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. అయితే.. రాష్ట్రాలు ఎలాంటి నీటి ప్రాజెక్టులు చేపట్టినా జాతీయ హాదా ఇచ్చే ఉద్దేశం లేదని గతంలో కేంద్రం ప్రకటించింది. అయితే ఇప్పుడు కర్నాటక ప్రతిపాదించిన అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎలా ఇస్తారని తెలంగాణ ప్రశ్నిస్తోంది. దీనిపై పార్లమెంటులో నిలదీయాలని టీఆర్ఎస్ భావిస్తోంది.
అప్పర్ భద్ర ప్రాజెక్టు పూర్తైతే దిగువనున్న తెలుగు రాష్ట్రాలకు నీటి లభ్యత పడిపోయే ప్రమాదం ఉంది. కానీ దీన్ని కేంద్రం ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం… ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంపై గట్టిగా నిలదీయాలని భావిస్తోంది. దీనిపై తన అభ్యంతరాలతో త్వరలోనే కేంద్ర జల్‌శక్తి శాఖకు లేఖ రాయనుంది. మరి కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.













