హస్తం పాలిటిక్స్…?
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రహస్యమిత్రులంటూ కాంగ్రెస్ గత కొంతకాలంగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. ఇరుపార్టీలు అవసరమొచ్చినప్పుడు కలిసినడుస్తారని… లేనప్పుడు కొట్టుకున్నట్లు నటిస్తారని ఆరోపిస్తూ వస్తోంది. దీన్ని బీజేపీ, బీఆర్ఎస్ లు కొట్టిపారేస్తున్నా.. కాంగ్రెస్ నేతలు మాత్రం తమ ప్రచారపంధాను కొనసాగిస్తున్నారు.అయితే ఇదే సమయంలో మంత్రి కేటీఆర్ .. కేంద్రమంత్రులను కలవడంపై తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే.. సెటైర్లు వేశారు. బీజేపీతో, బీఆర్ఎస్ కూటమిగా జట్టు కట్టేందుకు చర్చలు జరుపుతోందని ఆరోపించారు.
పాట్నాలో విపక్షాల మీటింగ్ జరుగుతున్న సమయంలో … ఢిల్లీలో బీజేపీతో బీఆర్ఎస్ నేతలు మంతనాలు జరపడమేంటని ప్రశ్నించారు మాణిక్ రావ్ ఠాక్రే. ప్రతిపక్షాల సమావేశం రోజే బీజేపీ మంత్రులను మంత్రి కేటీఆర్ కలవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కూటమి విషయమై కేంద్రమంత్రి అమిత్ షా, మరికొందరిని బీఆర్ఎస్ నేత కేటీఆర్ కలుస్తున్నారన్నారు.ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.తమ విజయాన్ని ఎవరు దాన్ని అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉందని.. ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారన్నారు మాణిక్ రావ్ ఠాక్రే..
ఓవైపు రాష్ట్రంలో బీజేపీ సైలెంట్ కావడంతో కాంగ్రెస్ దూకుడు పెంచింది. మరీ ముఖ్యంగా కేసీఆర్, బీఆర్ఎస్ వ్యతిరేక శక్తులు, నేతలతో సంప్రదింపులు జరుపుతోంది. బీఆర్ఎస్ ను ఓడించగలిగేది కాంగ్రెస్ ఒక్కటేనని.. పార్టీలో చేరాలని కోరుతోంది. దీంతో వ్యక్తిగత చరిష్మా ఉండి, కేసీఆర్ వ్యతిరేకంగా ఉన్న నేతలు .. హస్తం వైపు అడుగులు వేస్తున్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో నూతనోత్సహాం ఉరకలెత్తుతోంది. ఇక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం అంటూ సీనియర్ల ఏకతారాగం ఆపార్టీ క్యాడర్ ను ఉత్సాహంగా ముందుకు నడిపిస్తోంది.
ఇటీవలే సీఎం కేసీఆర్ సైతం రాష్ర్టంలోబీజేపీ పనైపోయిందని, కాంగ్రెస్ పుంజుకుంటోందని పరోక్షంగా వ్యాఖ్యానించారు. వాటిని సైతం కాంగ్రెస్ నేతలు తమకు అనుకూలంగా అన్వయించుకుంటున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ నేతల అవినీతిపై పక్కాగా ప్రచారం నిర్వహిస్తున్నారు.ఆఖరుకు అమరవీరుల జ్యోతి నిర్మాణంలోనూ అవినీతి జరిగిందని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీనికి తోడు జిల్లాలు, నియోజకవర్గాల స్థాయిలోనూ కాంగ్రెస్ నేతలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఢీ అంటే ఢీ అంటున్నారు. అంటే కాంగ్రెస్ లో ఇటీవలి కాలంలో నిర్లిప్తంగా ఉన్న కాంగ్రెస్ నేతల్లో .. ఇప్పుడు గెలుపుపై ఆశలు మొలకెత్తుతున్నాయని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.













