Trump: టారిఫ్స్ తో లాభపడ్డాం.. అందుకే ఆ పదమంటే ఇష్టమంటున్న ట్రంప్..!
Washington: అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఏది చేసినా, అందులో ఓవిశేషముంటుంది. అది మంచిదా, చెడ్డదా పక్కన పెడితే.. అందులో తనముద్ర ఉండేలా చూసుకుంటారు ట్రంప్. గత ప్రభుత్వాలకు భిన్నంగా .. ప్రపంచ దేశాలపై టారిఫ్ లు విధించి.. దేశానికి అత్యధిక ఆదాయం వచ్చేలా చేశానని ట్రంప్ చెప్పుకొచ్చారు. అంతేకాదు.. గతంలో ఏ అధ్యక్షుడు చేయని విధంగా 8 యుద్ధాలను ఆపానని జబ్బలు చరుచుకుంటున్నారు కూడా.
‘‘10 నెలల్లో ఎనిమిది యుద్ధాలు ఆపా. ఇరాన్ అణుముప్పును అడ్డుకున్నా. గాజా యుద్ధం ఆపి.. పశ్చిమాసియాలో తొలిసారి శాంతిని నెలకొల్పా’’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.. ఈ సందర్భంగా టారిఫ్ల గురించి స్పందిస్తూ.. అమెరికాలో 18 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించగలిగామని తెలిపారు. సుంకాల కారణంగానే ఇదంతా సాధ్యమైందన్నారు. ‘టారిఫ్’ అనే పదం తనకు చాలా ఇష్టమని, అనేక దశాబ్దాల పాటు ఇతర దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా దీన్ని వినియోగించాయన్నారు. ఇకపై అది కుదరదని వ్యాఖ్యానించారు. అమెరికాలో తయారుచేసే వాటికి సుంకాలు ఉండవనే కారణంతో అనేక కంపెనీలు దేశానికి తిరిగి వస్తున్నాయన్నారు.
తన ప్రసంగంలో ట్రంప్… తన పదవి కాలంలో మెరుగుపడిన ఆర్థిక వ్యవస్థ, సరిహద్దు భద్రత, వలస విధానాలు, దేశాలపై టారిఫ్లు తదితర అంశాల గురించి ప్రస్తావించారు. భారత్-పాక్ సహా పలు యుద్ధాలు ఆపానంటూ మరోసారి చాటింపు వేసుకున్నారు. ఈ సందర్భంగా అమెరికాకు చెందిన ప్రతి సైనికుడికి ట్రంప్ (Donald Trump) 1,776 డాలర్ల నగదు బహుమతి ప్రకటించారు.
ఇక, క్రిస్మస్ సందర్భంగా ప్రతి అమెరికన్ సైనికుడికి 1,776 డాలర్ల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. సాయుధ దళాల సేవ, త్యాగాలకు గుర్తుగా.. దీనికి ‘వారియర్ డివిడెండ్’గా పేర్కొన్నారు. 1.45 మిలియన్లకు పైగా ఉన్న సైనిక సిబ్బందికి క్రిస్మస్కు ముందే దీన్ని అందించనున్నట్లు తెలిపారు.






