ఒక్కడున్నాడు..! శెభాష్ స్టాలిన్..!!

తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమే. గతంలో జయలలిత, కరుణానిధి ఉన్న సమయంలో తమిళనాడులో రాజకీయాలు ఏ స్థాయిలో ఉండేవో ప్రపంచమంతా చూసింది. జయలలిత అధికారంలో ఉంటే ప్రతిపక్ష డిఎంకెని ముప్పుతిప్పలు పెట్టేవారు. అదే సమయంలో కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జయలలితను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. కానీ ఇప్పుడు తరం మారింది. జయలలిత, కరుణానిధి లేని రాజకీయాలు ఇప్పుడు తమిళనాడులో కనిపిస్తున్నాయి.
ఇటీవల జరిగిన ఎన్నికలలో డీఎంకె ఘన విజయం సాధించింది. కరుణానిధి తనయుడు స్టాలిన్ అధికార పగ్గాలు చేపట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే స్టాలిన్ కూడా కరుణానిధి లాగే అన్నాడీఎంకే పై విరుచుకు పడతారని భావించారు. కానీ అలాంటి వాళ్ళందరికీ తన చేష్టలతో సమాధానం చెప్పారు స్టాలిన్. తమిళనాడు రాజకీయాలకు పూర్తిగా తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు స్టాలిన్. అధికారంలోకి వచ్చిన తర్వాత స్టాలిన్ చేపట్టిన చర్యలు చూసి యావద్దేశం ఆశ్చర్యపోతోంది. తమిళనాడులో ప్రత్యర్థి పార్టీలు కూడా శభాష్ అనేలా పరిపాలన సాగుతోంది.
అధికారంలోకి వచ్చిన వెంటనే అమ్మ క్యాంటీన్లు యధాతధంగా కొనసాగిస్తామని.. అందులోనూ అవి జయలలిత బొమ్మతోనే నడుస్తాయని ప్రకటించారు. ఇది స్టాలిన్ మొదటి గెలుపు. సాధారణంగా అయితే జయలలిత మొహం చూడడానికి కూడా డీఎంకే శ్రేణులు అంగీకరించవు. కానీ స్టాలిన్ అలా ప్రవర్తించలేదు. జయలలిత బొమ్మతోనే అమ్మ క్యాంటిన్లు కొనసాగుతాయని తన పార్టీ శ్రేణులందరికీ క్లారిటీ ఇచ్చారు. అమ్మ క్యాంటీన్ లపై నిరసనలు, ఆందోళనలు చేయవద్దని కోరారు. అలా చేసిన వారిపై కేసులు పెట్టారు.
ఆ తర్వాత కరోనాపై పోరు కోసం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు స్టాలిన్. ఇటీవల కాలంలో చాలా రాష్ట్రాల్లో అఖిలపక్ష సమావేశాలు లేకుండా పోయాయి. ప్రతిపక్ష పార్టీలను అధికార పార్టీలు పట్టించుకోవట్లేదు. దీంతో అఖిలపక్ష సమావేశం అనే పదమే లేకుండాపోయింది. కానీ తమిళనాడులో స్టాలిన్ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టడంతో ప్రత్యర్థి పార్టీలు ఆశ్చర్యపోయాయి. అంతేకాదు.. అందరితో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేశారు. డీఎంకే తరఫున తను మాత్రమే కమిటీలో ఉంటూ మిగిలిన అన్ని పార్టీల నుంచి సభ్యులను తీసుకున్నారు. అన్నాడీఎంకేకి చెందిన మాజీ ఆరోగ్య మంత్రికి కూడా కమిటీలో స్థానం కల్పించారు. ప్రత్యర్థి పార్టీలకు ఈ స్థాయిలో గౌరవం లభించడం ఆశ్చర్యానికి గురి చేసింది.
అంతేకాదు రాష్ట్రాభివృద్ధి కోసం సూచనలు, సలహాలు ఇవ్వాలంటూ వివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు స్టాలిన్. అందులో భాగంగానే మీడియా అధిపతులతో స్టాలిన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో సుపరిపాలన అందించడానికి సలహాలు, సూచనలు అడిగారు. ఇది ఒక కొత్త ట్రెండ్ అని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా.. ఏ రాష్ట్రంలో అయినా ప్రతిపక్షాలను కానీ, మీడియాను కానీ గౌరవిస్తున్న సందర్భాలు లేవు. అధికారంలోకి వచ్చిన వెంటనే తమదే రాజ్యం అన్నట్లు, వాళ్లు చెప్పిందే వేదం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.
కానీ స్టాలిన్ ఇందుకు విరుద్ధమైనటువంటి పంథాను ఎంచుకున్నారు. తమిళనాడులో కొన్ని దశాబ్దాలుగా ఇలాంటి వాతావరణం కనిపించలేదు. తొలిసారి అధికార డీఎంకే.. ప్రతిపక్ష అన్నాడిఎంకె మధ్య కాస్త సానుకూల వాతావరణం కనిపిస్తోంది. పగ ప్రతీకారాలకు దూరంగా ఆ రెండు పార్టీల శ్రేణులు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రెడిట్ అంతా కచ్చితంగా స్టాలిన్ దే అని చెప్పొచ్చు. గతంలో లాగా పగ రాజకీయాలకు దూరంగా ఉంటూ తనదైన ముద్ర వేసేందుకు స్టాలిన్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు ఆయన ఎంచుకున్న మార్గమే సామరస్యత, సుపరిపాలన. ఈ రెండు ప్రధాన అస్త్రాలుగా స్టాలిన్ ముందుకు సాగుతున్నారు. ఇదే పంథాలో సాగితే స్టాలిన్ కు తిరుగు ఉండకపోవచ్చు.