స్వాతి మాలివాల్ పై ఆప్ నేతలు ఎందుకు దాడి చేశారు..?
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్ పై దాడి ఘటనలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ పై కేసు నమోదైంది. ఈ ఘటనపై ఆమె నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు బిభవ్‌ను నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. వాంగ్మూలంలో స్వాతి సంచలన ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. అతడు తనపై విచక్షణారహితంగా భౌతిక దాడికి పాల్పడ్డాడని, సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు కొట్టాడని ఆప్ ఎంపీ ఆరోపించినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో తెలిపారు.
గురువారం మాలీవాల్ ఇంటికి వెళ్లి ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది ఢిల్లీ పోలీసు బృందం. ఈ సందర్భంగా దాడి ఘటనను ఎంపీ పోలీసులకు వివరించారు. ‘‘సీఎం నివాసంలో కూర్చున్న నా వద్దకు బిభవ్ వచ్చి దాడికి దిగాడు. 7-8 సార్లు చెంపపై కొట్టాడు. ఛాతి, కడుపుపై కాలితో తన్నాడు. ఏం జరుగుతుందో అర్థం కాక షాక్‌కు గురయ్యా. సాయం కోసం అరిచా. నన్ను నేను రక్షించుకునేందుకు అతడిని నా కాళ్లతో బలంగా తోసేశా. పరిగెడుతుంటే నా చొక్కా పట్టుకుని వెనక్కి లాగాడు. సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు కొట్టాడు. పొత్తి కడుపులో విపరీతమైన నొప్పితో నడవలేకపోయా. ఎలాగో తన నుంచి తప్పించుకుని బయటకు వచ్చి పోలీసులకు ఫోన్ చేశా’’ అని స్వాతి వెల్లడించినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
స్వాతి ముఖంపై గాయాలు..
దాడి ఆరోపణల నేపథ్యంలో ఆప్ ఎంపీకి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె ముఖంపై అంతర్గత గాయాలైనట్లు ఈ పరీక్షలో తేలిందని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 13న కేజ్రీవాల్ నివాసంలోనే స్వాతి మాలివాల్ పై దాడి జరిగింది.. దీన్ని ఆప్ కూడా ధ్రువీకరించి, బిభవ్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపింది. తనకు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని అన్నారు స్వాతి. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని బీజేపీకి విజ్ఞప్తి చేశారు.
ఆప్‌లో ఇలాంటి దాడులు సాధారణమే..
స్వాతి మాలీవాల్‌పై దాడి నేపథ్యంలో ఆప్ మాజీ నాయకురాలు షాజియా ఇల్మి సంచలన ఆరోపణలు చేశారు. గతంలో తనకూ ఇలాంటి అనుభవాలు ఎదురైనట్లు చెప్పారు. ఆ పార్టీలో కొట్టడం సర్వసాధారణమని అన్నారు. ‘‘స్వాతిపై దాడి జరిగింది. కేజ్రీవాల్ చెప్పింది చేయడమే బిభవ్ పని. ఆ వ్యక్తి దురుసు ప్రవర్తనను నేనూ సహించాల్సి వచ్చింది. అక్కడ కొట్టడం మామూలే. ప్రశాంత్ కుమార్, యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్లను బౌన్సర్లలతో గెంటేశారు. ఈ సారి హద్దులు దాటారు. పీఏతో ఓ మహిళను కొట్టంచడం తగినదేనా? ఇంత జరిగాక కేజ్రీవాల్ సీఎం పదవిలో కొనసాగడం సరికాదు. ఘటనకు బాధ్యత వహిస్తూ క్షమాపణలు చెప్పి పదవికి రాజీనామా చేయాలి’’ అని ఆమె డిమాండ్ చేశారు.













