రాహుల్ ఎంపీ పదవి సేఫ్..! సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్..!!
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. మోదీ ఇంటిపేరుపై గతంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన అనర్హతకు గురయ్యారు. దీనిపై కోర్టులో సవాల్ చేయడంతో ఆయనకు అనుకూలంగా సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో సంబరాలు మొదలయ్యాయి. సుప్రీంకోర్టు ఉత్తర్వులు అందగానే రాహుల్ గాంధీపై అనర్హతను లోక్ సభ సెక్రటేరియేట్ తొలగించే అవకాశం ఉంది. ఆ వెంటనే రాహుల్ సమావేశానికి కూడా హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. సోమవారం నుంచి ఆయన పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంది.
2019 కర్నాటక ఎన్నికల సమయంలో మోదీ ఇంటిపేరును కించపరిచేలా రాహుల్ గాంధీ ప్రసంగించారంటూ ఆయనపై గుజరాత్ లోని సూరత్ లో కేసు నమోదైంది. దీనిపై అనేక విచారణల అనంతరం ఇటీవల ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయనపై అనర్హత వేటు పడింది. తీర్పు వచ్చిన వెంటనే రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్ సభ సెక్రటేరియేట్ నోటిఫికేషన్ వెలువడింది. దీంతో ఆయన మాజీ ఎంపీ అయిపోయారు. అయితే సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన గుజరాత్ హైకోర్టును, తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆయనపై కింది కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది.
రాహుల్ గాంధీ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ వెంటనే హైకోర్టు కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ తీర్పు చెప్పింది. దీనిపై ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆయనపై రెండేళ్ల శిక్షను ఎందుకు విధించాలో సెషన్స్ కోర్టు సరైన ఆధారాలను చూపించలేకపోయిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అన్ని అంశాలనూ పరిశీలించకుండా ఇచ్చిన తీర్పు వల్ల పిటిషనర్ పై తీవ్ర ప్రభావం పడిందని అభిప్రాయపడింది. దాని వల్ల ఆయన ప్రజాజీవితంలో ఉండలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పింది.
మరోవైపు రాహుల్ గాంధీకి కూడా సుప్రీంకోర్టు చురకలు అంటించింది. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు ఇలాంటి కామెంట్స్ చేసే ముందు ఆలోచించుకోవాలని చెప్పింది. భవిష్యత్తులో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని సూచించింది. రాహుల్ గాంధీపై కక్ష సాధించేందుకే బీజేపీ నేతలు ఆయనపై కేసు పెట్టారని.. ఆయన్ను సభకు రానివ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని రాహుల్ గాంధీ లాయర్ అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. ఆయన వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రాహుల్ మళ్లీ లోక్ సభలో అడుగు పెట్టేందుకు అవకాశం కలిగింది. సుప్రీంకోర్టు తీర్పుపై రాహుల్ గాంధీ స్పందించారు. ఏది జరిగినా తన కర్తవ్యం మాత్రం ఒకేలా ఉంటుందని.. దేశ సిద్ధాంతాలు, ప్రయోజనాలు కాపాడడమే లక్ష్యంగా పని చేస్తానని ఆయన ట్వీట్ చేశారు.













