బీజేపీకి పక్కలో బల్లెం… సుబ్రమణ్యస్వామి!
బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఏ అంశంపైనైనా నిర్మొహమాటంగా మాట్లాడుతుంటారు. తప్పు చేస్తే సొంత పార్టీ వాళ్లని కూడా కూడరు. వాళ్ల తప్పిదాలను ఎత్తి చూపుతుంటారు. ఈ విషయం ఆ పార్టీ వాళ్లకు కూడా తెలుసు. పార్టీకి ఇబ్బంది కలిగించేలా మాట్లాడినా ఆయనపై చర్యలుండవు. ఏదో పెద్దాయన మాట్లాడారులే.. అనే ఉద్దేశంతో లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఒక్కోసారి ఆయన మాటలు కొంత ఇబ్బంది కలిగిస్తుంటాయి. ఇప్పుడు కూడా సుబ్రమణ్యస్వామి అలాంటి ఇబ్బందికరమైన కామెంట్సే చేశారు.
బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి బుధవారం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీని ప్రభుత్వ పరిధి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. గతంలో తమిళనాడులోని సబానాయకర్ ఆలయాన్ని ప్రభుత్వం తనపరిధిలోకి తీసుకోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే టీటీడీ లావాదేవీలను కూడా కాగ్ ద్వారా ఆడిట్ చేయించాలని డిమాండ్ చేశారు. సుబ్రమణ్యస్వామి ఈ డిమాండ్ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా పలుమార్లు ఈ విషయాన్ని లేవనెత్తారు. కోర్టులో పోరాడేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే టీటీడీపై అసత్య ప్రచారం చేసిన మీడియాపైన కూడా వంద కోట్లకు పరువునష్టం దావా వేస్తున్నట్లు చెప్పారు.
సరే.. ఈ విషయాన్ని పక్కనపెడదాం.. ఏపీ టూర్ లో ఆయన చేసిన కొన్ని కామెంట్లు బీజేపీకి ఇబ్బందికరంగా మారాయి. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీలో పెద్దఎత్తున ఉద్యమం జరుగుతోంది. ఈ విషయంపై సుబ్రమణ్యస్వామి నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడం సరికాదని స్పష్టం చేశారు. రన్నింగ్ లో ఉన్న కంపెనీని ప్రైవేటుకు అప్పగించడం మంచి పద్ధతి కాదన్నారు. బలమైన కారణాలు ఉంటే తప్ప.. ప్రతీదాన్ని ప్రైవేటుపరం చేస్తూ పోవడం సరికాదన్నారు. ప్రభుత్వం వ్యాపారం చేయొచ్చా.. వద్దా అనేది కేస్ బై కేస్ చూడాలన్నారు. స్టీల్ ప్లాంట్ ను వ్యతిరేకిస్తూ సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాయడాన్ని సుబ్రమణ్యస్వామి సమర్థించారు.
ఓ వైపు కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేసి తీరుతామని స్పష్టం చేస్తున్న నేపథ్యంలో సుబ్రమణ్యస్వామి కామెంట్స్ ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. పక్కలో బల్లెంలాగా తయారయ్యారంటూ ఆ పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్న పరిస్థితి. మరి సుబ్రమణ్యస్వామి కామెంట్స్ పై ఆ పార్టీ అధిష్టానం ఏమైనా స్పందిస్తుందా.. లేకుంటా యధావిథిగా లైట్ తీసుకుంటుందా.. అనేది వేచి చూడాలి.













