చిక్కుల పరంపరలో ట్రంప్..
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చిక్కులపరంపర కొనసాగుతోంది. శృంగార తార స్టార్మీ డేనియల్‌తో అక్రమ సంబంధం కేసులో ఆయనపై నమోదైన అన్ని ఆరోపణలు రుజువైనట్లు న్యూయార్క్ కోర్టు తేల్చింది. దాదాపు 34 అంశాల్లో ఆయనను దోషిగా నిర్ధరించింది. ఇలా ఓ కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడు ట్రంపే కావడం గమనార్హం. మరో ఐదు నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ తీర్పు వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది.
స్టార్మీ డేనియల్‌తో ట్రంప్ గతంలో ఏకాంతంగా గడిపారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో నోరు విప్పకుండా ట్రంప్ పెద్ద మొత్తంలో డబ్బు ముట్టజెప్పారని అభియోగాల్లో పేర్కొన్నారు. తన న్యాయవాది ద్వారా ఆమెకు సొమ్ము ఇప్పించారని తెలిపారు. ప్రచార కార్యక్రమాల కోసం అందిన విరాళాల నుంచి ఆ మొత్తాన్ని ఖర్చు చేశారని తెలిపారు. అందుకోసం బిజినెస్ రికార్డులన్నింటినీ తారుమారు చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఇలా మొత్తం 34 అంశాల్లో ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. సుదీర్ఘ విచారణ అనంతరం అవన్నీ నిజమేనని తాజాగా కోర్టు తేల్చింది. ట్రంప్‌తో అక్రమ సంబంధం వాస్తవమేనని స్టార్మీ డేనియల్స్ స్వయంగా కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే.
జైలుకెళ్లాల్సిందేనా?
దోషిగా తేలడంతో ట్రంప్ జైలుకెళ్లాల్సిందేనా అనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. దీనికి కచ్చితమైన సమాధానం చెప్పలేమని నిపుణులు అంటున్నారు. జులై 11న ఆయనకు కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. బిజినెస్ రికార్డులు తారుమారు చేయడమనేది న్యూయార్క్‌లో తక్కువ తీవ్రత ఉన్న నేరంగా పరిగణిస్తారు. గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. దీనిపై పూర్తి విచక్షణాధికారం న్యూయమూర్తిదే. కచ్చితంగా జైలు శిక్ష విధిస్తారని కూడా చెప్పలేమని అక్కడి న్యాయ నిపుణులు వెల్లడించారు. అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకవేళ జైలు శిక్ష కాకపోతే జరిమానా కూడా విధించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇంతకంటే తీవ్రమైన మరో మూడు కేసుల్లోనూ ట్రంప్ అభియోగాలు ఎదుర్కొంటుండడం గమనార్హం. అవేవీ ఎన్నికల ముందు విచారణకు వచ్చే అవకాశం లేదని ఆయన న్యాయవాదుల బృందం ధీమాగా ఉంది.
ఎన్నికల్లో పోటీ పరిస్థితేంటి?
తాజా కోర్టు తీర్పుతో ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిత్వంపై ఎలాంటి ప్రభావం ఉండదని న్యాయనిపుణులు తెలిపారు. నేరారోపణలు రుజువైతే ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలగాలనే నిబంధనేమీ లేదని వెల్లడించారు. 1920లో ఓ సోషలిస్ట్ నేత జైలులో ఉండే అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేశారని కొందరు గుర్తుచేశారు. తాజాగా ట్రంప్ సైతం యథావిధిగా ప్రచారం కొనసాగించొచ్చని వెల్లడించారు. దోషిగా తేలి గృహ నిర్బంధానికి పరిమితమైతే ట్రంప్ వర్చువల్‌గా ప్రచారం చేపడతారని ఆయన కోడలు, రిపబ్లికన్ నేషనల్ కమిటీ కో-ఛైర్ లారా ట్రంప్ వెల్లడించారు.
ఇప్పటికే అక్కడి ఓటర్లు రెండువర్గాలుగా చీలిపోయినట్లు విశ్లేషకులు అంచనా వేశారు. ఈ తరుణంలో తాజా తీర్పు ఎన్నికలపై ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది చెప్పలేమన్నారు. ఇప్పటికీ బైడెన్‌ను ఓడించే సత్తా ట్రంప్‌నకు ఉందని అక్కడి ప్రముఖ రాజకీయ వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు. పైగా తాజా తీర్పుతో రిపబ్లికన్ వర్గాలను మరింత ఐక్యం చేస్తాయని భావిస్తున్నారు. ట్రంప్‌నకు మద్దతుగా పెద్ద ఎత్తున విరాళాలు వెల్లువెత్తే అవకాశం ఉందంటున్నారు. ఆయన దోషిగా తేలితే పరిస్థితేంటని ఇటీవల ఓ ప్రముఖ ఛానెల్ పోల్ నిర్వహించింది. కేవలం 4 శాతం మంది మాత్రమే మద్దతు ఉపసంహరించుకుంటామని తెలిపారు. మరో 16 మంది ఆలోచిస్తామని వెల్లడించడం గమనార్హం.
అప్పీలు అవకాశాలు..
కోర్టు శిక్ష ఖరారు చేసిన తర్వాత తనను దోషిగా తేలుస్తూ ఇచ్చిన తీర్పుపై ట్రంప్ పై కోర్టులో అప్పీలు చేసుకోవచ్చు. అందుకోసం ఆయన న్యాయవాదుల బృందం ఇప్పటికే పనులు ప్రారంభించింది. మరోవైపు…ఇది అవమానకరమంటూ తీర్పును ట్రంప్ కొట్టిపారేశారు. ఇది అవినీతిపరుడైన ఒక వివాదాస్పద న్యాయమూర్తి జరిపిన విచారణ అని ఆరోపించారు. నిజమైన తీర్పు నవంబర్ 5 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలిస్తారని వ్యాఖ్యానించారు. తాను అమాయకుడిననే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. దేశం కోసం, న్యాయం కోసం పోరాడుతూనే ఉంటానని చెప్పారు. మరోవైపు బైడెన్-హారిస్ ప్రచార బృందం ఈ తీర్పును స్వాగతించింది. ఎవరూ చట్టానికి అతీతులు కారనే విషయం మరోసారి నిరూపితమైందని పేర్కొంది. ట్రంప్ తనకు చట్టాలేమీ వర్తించవనే ధోరణిలో వ్యవహరించేవారని ఆరోపించింది. అవన్నీ అపోహలేననే విషయం ఈ తీర్పుతో స్పష్టమైందని వ్యాఖ్యానించింది.






