5 రాష్ట్రాల ఎన్నికలు.. ఇరకాటంలో బీజేపీ!
ప్రస్తుతం దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. పశ్చిమబెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలను బీజేపీ సెమీ ఫైనల్ గా భావిస్తోంది. ఇప్పటికే పలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను చేజిక్కుంచుకున్న బీజేపీ.. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న ఈ రాష్ట్రాల్లో పాగా వేయగలిగితే దేశంలో తమకు తిరుగుండదని నమ్ముతోంది. అందుకే అస్త్రశస్త్రాలు సంధిస్తోంది.
అయితే బీజేపీ ప్లాన్స్ అంతగా వర్కవుట్ కావట్లేదని తెలుస్తోంది. కొన్ని అంశాలు ఆ పార్టీ ముందరికాళ్లకు బంధం వేస్తున్నాయి. ముఖ్యంగా అమాంతం పెరిగిపోయిన పెట్రో ఉత్పత్తుల ధరలు బీజేపీ నేతల స్పీడ్ కు బ్రేకులు వేస్తున్నాయి. అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నాయి కాబట్టి.. అందుకు అనుగుణంగానే ఇక్కడా ధరలు పెరుగుతున్నాయని బీజేపీ నేతలు చెప్తున్నారు. అయితే వారి మాట ఎవరూ వినే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే కరోనా లాక్ డౌన్ సమయంలో అంతర్జాతీయంగా ధరలు భారీగా తగ్గాయి. అప్పుడు కూడా కేంద్రంలోని మోదీ సర్కార్ పెట్రో ధరలను ఏమాత్రం తగ్గించలేదు. ఇప్పుడేమో అక్కడ పెరిగాయి కాబట్టి పెరుగుతున్నాయ్ అంటున్నారు. మరి తగ్గినప్పుడు ఎందుకు తగ్గించలేదని ప్రశ్నిస్తున్నారు వినియోగదారులు.
ఇదే అంశాన్ని ఆయా రాష్ట్రాలన్ని బీజేపీయేతర పార్టీలు ప్రధాన అస్త్రాలుగా మలుచుకున్నాయి. పశ్చిమ బెంగాల్ లో సీఎం మమత బెనర్జీ.. ప్రధాని మోదీ పర్యటించిన రోజే పెట్రో ధరలకు వ్యతిరేకంగా పాదయాత్ర చేశారు. సిలిండర్ తో నిరసన తెలిపారు. తమిళనాడులో సమరశంఖం పూరించిన స్టాలిన్ కూడా ఇదే అంశాన్ని ప్రధానాస్త్రంగా చేసుకున్నారు. ఇక కేరళలో ఎల్.డి.ఎఫ్ నేతలతో పాటు కాంగ్రెస్ కూడా పెట్రో ధరలను ఎత్తి చూపుతోంది. దీంతో బీజేపీకి ఏం చేయాలో అర్థం కావట్లేదు.
పెట్రో ఉత్పత్తుల ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ రాష్ట్రాలు పన్నులు తగ్గించుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉచిత సలహా ఇస్తున్నారు. తాము తగ్గించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఆ మేరకు మీరెందుకు తగ్గించకూడదని రాష్ట్రాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు తమ పరిధిలోని సుంకాలను కొంతమేర తగ్గించుకున్నాయి కూడా. మేం తగ్గించాం.. మరి మీరు తగ్గిస్తారా అని ప్రశ్నిస్తున్నాయి. దీంతో బీజేపీపై ఒత్తిడి అమాంతం పెరిగిపోతోంది. దీంతో ఎన్నికల ముందే కొంతమేర ఊరట కల్పిస్తే బాగుంటుందని బీజేపీ పెద్దలు చర్చించుకుంటున్నారు. మరి తగ్గిస్తారో.. లేదో చూడాలి మరి.!













