కేంద్రం వర్సెస్ స్టాలిన్..
మంత్రి సెంథిల్ బాలాజీ వ్యవహారంతో తమిళనాడు గవర్నర్ వర్సెస్ స్టాలిన్ ప్రభుత్వం మధ్య అగాథం మరింత పెరిగింది. రాష్ట్రప్రభుత్వ కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న గవర్నర్ ఆర్ఎన్ రవిని కట్టడి చేయకుంటే ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందని కేంద్రాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలకు ఏ మంచి చేసినా ఆయనకు పట్టదని, అందువల్లే రవిని తమిళనాడుకు బద్ధ శత్రువని చెప్పాల్సి వస్తోందన్నారు. చెన్నైలో నిర్వహించదలచిన అంతర్జాతీయ పెట్టుబడిదారుల మహానాడుకు విదేశీ వ్యాపారవేత్తలను ఆహ్వానించడాన్ని సైతం గవర్నర్ తప్పు బట్టారన్నారు. విదేశీ పెట్టుబడిదారులకు తప్పుడు సమాచారం అందజేసేపనిలోకి దిగారన్నారు. గవర్నర్ ఇలా వ్యవహరించడానికి కారణం కేంద్రప్రభుత్వమా? లేక మరేదైనా అన్నది తనకు తెలియదన్నారు.
గవర్నర్ కేవలం నామినేటెడ్ పదవి మాత్రమేనని, ఒకమంత్రిని తొలగించే, లేదా నియమించే అధికారం ఆయనకు లేదన్నారు స్టాలిన్. గవర్నర్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ నేతగా మారకూడదన్నారు. మంత్రి సెంథిల్ బాలాజి వ్యవహారంలో బీజేపీ చెప్పినట్లు గవర్నర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అన్నాడీఎంకే ప్రభుత్వంలో ఈడీ, ఆదాయపన్ను శాఖలు నిర్వహించిన తనిఖీల్లో అప్పటి మంత్రులను ఇప్పటివరకూ అరెస్టు చేయలేదన్నారు. అన్నాడీఎంకే అధికారం కోల్పోయిన తరువాత కూడా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అయితే సెంథిల్ బాలాజి విషయంలో మాత్రమే రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందన్నారు. శాఖలేని మంత్రిగా ఉన్నందున సెంథిల్ బాలాజీని మంత్రివర్గం నుంచి గవర్నర్ తొలగించడం చట్టవిరుద్దమన్నారు.
దేశంలో ఎంతోమంది మం త్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అవినీతి కేసులు ఎదుర్కొంటున్నారని స్టాలిన్ గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కోర్టు శిక్ష విధించాక కూడా ఆమె ఆ పదవిలో కొనసాగారన్నారు. ఇప్పుడున్న కేంద్రమంత్రుల్లో పలువురిపై అవినీతి కేసులు పెండింగ్లో ఉన్నాయని ఎన్నికల కమిషన్కు ఇచ్చిన నామినేషన్లను పరిశీలిస్తే అవగతమవుతుందన్నారు. ప్రస్తుత గవర్నర్ను తక్షణం రీకాల్ చేయాలని డిమాండ్ చేసిన సీఎం.. అసలు రాష్ట్రానికి గవర్నరే అవసరం లేదన్నది తమ అభిప్రాయమన్నారు.
జాతీయస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా బలమైన కూటమి ఏర్పాటులో డీఎంకే క్రియాశీలకంగా ఉంటుందని, ఆ కూటమిలో జాతీయస్థాయి పార్టీలు, పలురాష్ట్రాల ముఖ్యమంత్రులు చేరేందుకు ఉత్సాహం చూపుతున్నాయన్నారు. ఇప్పటికే పలువురు నేతలు కూడా తనతో మాట్లాడారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ లేని కూటమి కావాలని పలువురు తనను సంప్రదించిన మాట వాస్తవమేనని, అయితే అందుకు తాను వ్యతిరేకినని స్పష్టం చేశారు. కాంగ్రెస్ లేని ఏ కూటమి కూడా బీజేపీకి ఎదురొడ్డి నిలవలేదన్నారు. బీజేపీ ఎన్ని ఎత్తులు వేసినా కాంగ్రెస్ – డీఎంకే నేతృత్వంలోని కూటమిలో చీలికలు తీసుకురాలేదన్నారు. తమ రాజకీయ సిద్ధాంతాలను మార్చుకోబోమన్నారు.













