పీకేతో నితీశ్ కుమార్ భేటీ – ఇంతలోనే ఎంత మార్పు?
రాజకీయాల్లో శాశ్వత మిత్రులూ ఉండరు.. శాశ్వత శతృవులూ ఉండరు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పటి రాజకీయ నాయకులైతే ఎప్పుడు ఎక్కడ ఉంటారో.. ఎవరో ఉంటారో అంతుచిక్కని పరిస్థితి ఉంది. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి బీహార్లో జరిగింది. బీహార్ సీఎం నితీశ్ కుమార్ బీజేపీకి బై చెప్పి ఆర్జేడీ, కాంగ్రెస్ లతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ ఏమాత్రం ఊహించని సంఘటన ఇది. ఇప్పుడు బీజేపీపై యుద్ధం ప్రకటించారు నితీశ్ కుమార్. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎలాగైనా ఓడించాలనే తపనతో పని చేస్తున్నారు. పలు పార్టీల నాయకులతో కలిసి చేపట్టాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు.
తాజాగా నితీశ్ కుమార్.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో భేటీ అయ్యారు. ఇదిప్పుడు చాలా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గతంలో ఆర్జేడీలో కీలక పాత్ర పోషించారు ప్రశాంత్ కిశోర్. అయితే ఆ తర్వాత నితీశ్ కుమార్ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. దీన్ని సహించలేని నితీశ్ కుమార్.. ప్రశాంత్ కిశోర్ ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తీవ్రంగా శ్రమించారు కానీ వర్కవుట్ కాలేదు. దీంతో సొంతంగా పార్టీ పెట్టి బీహార్ ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.
దేశంలో పలు రాజకీయ పార్టీలతో పని చేస్తున్నారు ప్రశాంత్ కిశోర్. ఎన్నికల వ్యూహకర్తగా తన ప్రస్తానాన్ని బీజీపేతోనే ప్రారంభించారు ప్రశాంత్ కిశోర్. మోదీ ప్రధాని కావడానికి తెరవెనుక తీవ్రంగా కష్టపడింది ప్రశాంత్ కిశోరే. అయితే ఏం జరిగిందో ఏమో.. ఒక టర్మ్ ముగిసేనాటికే ఆయన బీజేపీకి దూరమయ్యారు. అప్పటి నుంచి ఆయన ఇతర పార్టీలకు పని చేయడం ప్రారంభించారు. మమత బెనర్జీ, వై.ఎస్.జగన్, స్టాలిన్.. తదితర పార్టీలతో పని చేసి వారిని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మాత్రం ఆయనే స్వయంగా బీహార్లో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. నితీశ్ కుమార్ పై తీవ్రంగా మండి పడుతున్నారు.
నితీశ్ కుమార్ – ప్రశాంత్ కిశోర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది ప్రస్తుతం. నితీశ్ కోసం తీవ్రంగా శ్రమించి అధికారంలోకి తీసుకొచ్చారు ప్రశాంత్ కిశోర్. దీంతో ఆయన్ను ఏకంగా పార్టీలో చేర్చుకున్నారు నితీశ్ కుమార్. అయితే వారి మధ్య గ్యాప్ రావడంతో పార్టీ నుంచి బయటకు పంపించేశారు. ఇది సహించలేని ప్రశాంత్ కిశోర్.. నితీశ్ పై యుద్ధం ప్రకటించారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వారిద్దరూ ప్రత్యేకంగా భేటీ కావడం ఆసక్తి కలిగిస్తోంది. ఆర్జేడీ మాజీ నేత ప్రశాంత్ వర్మ ఈ భేటీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ప్రశాంత్ కిశోర్ తో ట్రావెల్ చేస్తున్నారు.
బీజేని గద్దె దించడమే ఇద్దరు నేతల పంతం. ఇప్పుడు వీళ్లద్దరి భేటీ కూడా అందులో భాగంగానే జరిగి ఉంటుందని భావిస్తున్నారు. బీజేపీయేతర ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే దేశం బాగుపడుతుందని ప్రశాంత్ కిశోర్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇందుకోసం పలు పార్టీల నేతలతో సమావేశమై వారిని ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు నితీశ్ కుమార్ కూడా ఆ ప్రయత్నాల్లోనే ఉన్నారు. శతృవుకు శతృవు మిత్రుడవుతారన్నట్టు ఇప్పుడు నితీశ్ – పీకే కూడా ఉమ్మడి శతృవును ఓడించేందుకు ఏకమయ్యారు. బహుశా వచ్చే ఎన్నికల వరకూ ఇదే ఐకమత్యంతో విపక్షాలన్నీ ముందుకు సాగితే బీజేపీకి కాస్త ఇబ్బందులు తప్పకపోవచ్చేమో. మరి చూద్దాం ఈ నేతల మధ్య ఐక్యత ఎంతకాలం ఉంటుందో!













