ప్రశాంత్ కిశోర్‌కు తొలిరోజే షాక్..!
దేశంలో పలు రాజకీయ పార్టీలను అధికారంలోకి తెచ్చిన ఘనత ప్రశాంత్ కిశోర్ దేనని పలువురు చెప్పుకుంటూ ఉంటారు. పీకే సేవలు అందిస్తున్నాడంటే ఆ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతుందని అందరూ నమ్ముతారు. ఇప్పుడు వేరొకరికి సేవలు చేయడం ఏంటి.. మనమే అధికారంలోకి రావచ్చు కదా.. అని పీకే భావిస్తున్నారు. అందుకే బీహార్ లో రాజకీయ పార్టీని పెట్టారు. అక్కడ అధికారంలోకి వచ్చేందుకు నడుం బిగించారు. అందుకోసం అందరిలాగే పాదయాత్రనే అస్త్రంగా అంచుకున్నారు. మరి ప్రశాంత్ కిశోర్ అంచనాలను అందుకుంటారా.. ఆయన పాదయాత్రకు ఎలాంటి స్పందన వస్తోంది..?
ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే ఎన్నికల వ్యూహకర్తగా సుపరిచితులు. దేశంలో పలు రాజకీయ పార్టీలు పీకే సేవలకోసం పరితపిస్తుంటాయి. తమ పార్టీకి సేవలందించాలంటూ పీకే చుట్టూ తిరుగుతుంటాయి. తొలిసారి మోదీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టడంలో ప్రశాంత్ కిశోర్ పాత్ర కీలకం. సోషల్ మీడియాను మేనేజ్ చేయడం ద్వారా ప్రజల్లో తమదైన ముద్ర వేసి వారిని తమవైపు తిప్పుకోవడం పీకేకి వెన్నతో పెట్టిన విద్య. అందుకే పీకేను సోషల్ మీడియా మేనేజర్ గా చెప్పుకుంటూ ఉంటారు. తాము సేవలందించే పార్టీకి అనుకూలంగా.. విపక్షాలకు వ్యతిరేకంగా విచ్చలవిడిగా ప్రచారం నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఇప్పటివరకూ పీకే వ్యూహాలు రూపొందాయి. ఆ వ్యూహాలు వర్కవుట్ అయ్యాయి. మోదీ మొదలు వై.ఎస్.జగన్, మమత బెనర్జీ, స్టాలిన్, నితీశ్ కుమార్.. తదితర నేతలకు పీకే పని చేసి సక్సెస్ సాధించారు.
ప్రశాంత్ కిశోర్ కు రాజకీయాలపై మక్కువ ఎక్కువ. అందుకే తాను కూడా రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్నారు. తన వ్యూహాల ద్వారా ఆయా పార్టీల్లో తనకు తగిన స్థానం దక్కుతుందని .. అడిగినవన్నీ ఇస్తారని ఆశించారు. మొదట నితీశ్ నేతృత్వంలోని జేడీయూలో చేరారు. అయితే అక్కడ ఇమడలేకపోయారు. నితీశ్ ఏకంగా పీకేని పార్టీ నుంచి బహిష్కరించారు. ప్రస్తుతం వీక్ గా ఉన్న కాంగ్రెస్ పార్టీని సంప్రదించి తన ప్రపోజల్ ను సోనియా, రాహుల్ ముందు పెట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీలో అందరు నేతల్లాగే పని చేయాల్సి ఉంటుందని.. ప్రత్యేకంగా పోస్టులు క్రియేట్ చేయడం కుదరదని పీకేకు తేల్చి చెప్పారు. దీంతో పీకే ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఇక బీజేపీలోకి పీకే వెళ్లే పరిస్థితి లేదు. అందుకే ఏకంగా రాజకీయ పార్టీ పెడ్తున్నట్టు ప్రకటించారు.
దేశంలో బీజేపీని ఓడించాలనేది పీకే లక్ష్యం. అందుకోసం బీజేపీయేతర పార్టీలతో ఆయన పని చేస్తున్నారు. అదే సమయంలో తాను కూడా బీహార్ లో అధికారంలోకి రావాలని కలలు కంటున్నారు. తన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పాదయాత్రనే నమ్ముకున్నారు. దేశంలో పలువురు నేతలు పాదయాత్రలు చేసి అధికారంలోకి వచ్చిన దాఖలాలున్నాయి. దాన్నే పీకే కూడా పాటిస్తున్నారు. జన సురాజ్ యాత్ర పేరిట బీహార్ లో 3వేల 500 కిలోమీటర్ల పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున పాదయాత్రను ప్రారంభించారు.
అయితే ప్రశాంత్ కిశోర్ పాదయాత్రను జనం ఏమాత్రం పట్టించుకోలేదు. తొలిరోజు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అయితే సభలో జనం లేక బోసిపోయింది. అయినా తను అనుకున్న పాదయాత్రను మొదలుపెట్టారు. బీహార్ లోని ప్రతీ గ్రామాన్ని చుట్టిరావాలనేది పీకే వ్యూహం. అయితే తొలిరోజు ప్రశాంత్ కిశోర్ పాదయాత్ర చూసిన తర్వాత ఆయన పయనంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రశాంత్ కిశోర్ కు ప్రజల నుంచి ఏమాత్రం స్పందన కనిపించకపోవడంతో త్వరలోనే ఆయన పాదయాత్రకు స్వస్తి చెప్తారనే ఊహాగానాలు అప్పుడే మొదలయ్యాయి. వ్యూహకర్తలు రాజకీయ నాయకులు కాలేరని.. పీకే ఆయన పని చేసుకుంటే మంచిదని సూచనలు అందుతున్నాయి. మరి పీకే ఏం చేస్తారో చూడాలి.













