గుజరాత్ మీదుగా ఢిల్లీ పీఠంపై గురిపెట్టిన కేజ్రీవాల్..! సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉందా?
ఢిల్లీ.. పంజాబ్.. ఇప్పుడు ఆప్ వశమయ్యాయి. చాప కింద నీరులా తన పార్టీని విస్తరించుకుంటూ వెళ్తున్నారు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్. దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీలకు సైతం ముచ్చెమటలు పట్టిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అన్ని పార్టీలూ వణుకుతుంటే.. కేజ్రీవాల్ మాత్రం ఆ పార్టీకే ఎదురొడ్డి నిలుస్తున్నారు. బీజేపీ తన ప్రస్థానానికి పునాదిగా భావించే గుజరాత్ లోనే ఈసారి జెండా ఎగరేయాలని భావిస్తున్నారు కేజ్రీవాల్. అసలు కేజ్రీవాల్ కు ఇంతటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది.. గుజరాత్ లో ఆప్ పాగా వేయగలదా.. లాంటి ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నాయి.
వచ్చే ఏడాది గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీలో రెండోసారి అధికారంలోకి రావడం, తాజాగా పంజాబ్ లో పాగా వేయడంతో ఆప్ లో నూతనోత్సాహం నెలకొంది. ఇదే ఉత్సాహంతో గుజరాత్ లోనూ పాగా వేయాలనుకుంటున్నారు ఆప్ అధినేత కేజ్రివాల్. గుజరాత్ లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రెండు నెలల వ్యవధిలో ఆరు సార్లు ఆయన గుజరాత్ లో పర్యటించారంటే ఆయన ఎంతగా టార్గెట్ పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఆప్ ను గుజరాత్ లో బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆయన పర్యటనలు కొనసాగుతున్నాయి.
గుజరాత్ లో అధికారంలోకి వచ్చేందుకు తన పాత పంథానే ఎంచుకున్నారు కేజ్రివాల్. ఢిల్లీ, పంజాబ్ లలో అధికారంలోకి రావడానికి దోహదపడిన ఉచిత హామీలనే ఇప్పుడు గుజరాత్ లోనూ వల్లె వేస్తున్నారు. వరుస హామీలు గుప్పిస్తూ గుజరాతీల మనసు గెలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 2 లక్షల వరకూ వ్యవసాయ రుణాలు మాఫీ, రైతులకు పగటిపూట విద్యుత్, 3వందల యూనిట్ల వరకూ గృహ విద్యుత్ ఉచితం లాంటి అనేక హామీలు వల్లె వేస్తున్నారు. సామాన్యుల ఇళ్లకు వెళ్లడం.. వాళ్లతో కలిసి భోంచేయడం కేజ్రివాల్ స్టైల్. ఇదే స్టైల్ ను గుజరాత్ లోనూ ఫాలో అవుతున్నారు కేజ్రివాల్. సామాన్యుల మనసు గెలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీని జాతీయ పార్టీగా తీర్చిదిద్దాలనేది కేజ్రివాల్ లక్ష్యం. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకుంది. ఉత్తర భారత దేశంలో మంచి పట్టు సాధించింది. గోవాలో కూడా సత్తా చాటింది. ఇకపై ఉత్తర భారతంలో జరిగే అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా వీలైనన్ని సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కేజ్రివాల్. గుజరాత్ తర్వాత హిమాచల్ ప్రదేశ్ ను టార్గెట్ చేయబోతున్నారు.
గత రెండు దశాబ్దాలుగా గుజరాత్ లో బీజేపీ అధికారంలో ఉంది. అయితే ఈసారి ఆ పార్టీకి అధికారం దక్కనివ్వబోమని చెప్తున్నారు కేజ్రీవాల్. బీజేపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని చెప్పారు. ఓ వైపు ప్రభుత్వ వ్యతిరేకత, మరోవైపు కాంగ్రెస్ బలహీనంగా ఉండడం.. ఆప్ కు కలిసొస్తాయని అంచనా వేస్తున్నారు కేజ్రివాల్. ఉచితాలకు బీజేపీ వ్యతిరేకం కావడం కూడా కేజ్రివాల్ కు అస్త్రంగా మారింది. తాను ప్రకటించే పథకాలు కచ్చితంగా సామాన్యులకు మేలు చేస్తాయని.. వాళ్ల ఓట్లు ఆప్ కు పడతాయని భావిస్తున్నారు. మరి చూద్దాం.. గుజరాత్ లో ఏం జరగుతుందో!













